-94 శాతం ప్రజా సమస్యల్ని పరిష్కరించడం జరిగింది.
-డైరెక్టర్ డా. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“గ్రామ,వార్డు సచివాలయాల” ద్వారా 5కోట్ల 50 లక్షల మందికి వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్దిని అందించామని, 94 శాతం ప్రజా సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని ,ఆసంస్థల డైరెక్టర్ డా. లక్ష్మీశ తెలిపారు. ‘నభూతో, నభవిష్యతి’ అన్న విధంగా ఈ సంస్థల ఏర్పాటు ఆంధ్ర ప్రదేశ్ లో వినూత్న పరిపాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజల అవసరాలు పరిష్కారం వారి ఇంటివద్దే జరిగేలా ప్రభుత్వ నిర్వహణ యంత్రంగాన్ని గ్రామ స్థాయిలో ఏర్పాటు “గ్రామ,వార్డు సచివాలయాల” సిద్ధించిందని ” ఆయన తెలిపారు. సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం జర్నలిజం విద్యార్థులతో పాటు రాష్ట్రం లోని వర్కింగ్ జర్నలిస్టులకోసం ఏర్పాటు చేసే ఆన్ లైన్ అవగాహన సమావేశాల నిర్వహణలో భాగంగా “గ్రామ,వార్డు సచివాలయాల” వ్యవస్థ ప్రజలకు అందిస్తోన్న సేవలను ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వెల్లడించారు. అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడు ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్దిని పొందకుండా ఉండకూడదన్న ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ఆశయాన్ని “గ్రామ,వార్డు సచివాలయాల” వ్యవస్థ నిజం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవస్థలో భాగంగా రాష్ట్రం లో 50 వేల వరకు సంస్థలుగ్రామ స్థాయి లో ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి 50 కుటుంబాల అవసరాలను గుర్తించి, ఆయా ప్రభుత్వ విభాగాల ద్వారా పరిష్కరించేందుకు 2 లక్షల 66 వేల మంది వాలంటీర్లను నియమించడం జరిగిందన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన భూ సర్వే , సంక్షేమ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉద్యోగులు గతంలో మండలానికే పరిమితమై ఉండేవారని ఆయన అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఆయా శాఖల ఉద్యోగుల్ని గ్రామ, వార్డు స్థాయిలో నియమించామన్నారు. ప్రతి రోజు గ్రామ వార్డు సచివాలయాల్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి వినతులు ఇచ్చే అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు.ఈ సంస్థల ద్వారా 5కోట్ల 50 లక్షల మందికి వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్దిని అందించామన్నారు. ఇది మన జనాభాకంటే ఎక్కువ అని, ఒక్కో వ్యక్తికి ఒకటికి మించిన పధకాల ద్వారా లబ్ది చేకూరడం వల్లనే లబ్ధిదారుల సంఖ్య జనాభా కంటే పెరిగిందన్నారు. అదేవిధంగా ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే 94 శాతం ప్రజా సమస్యల్ని పరిష్కరించడం జరిగిందన్నారు.
అయితే, ప్రభుత్వం ఈ విజయంతో సంతృప్తి చెందలేదని, అర్హులై పథకాలు అందకుండా మిగిలిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు “జగనన్న సురక్ష” పథకం ప్రారంభించామన్నారు. ఈ పథకంలో తమంత తాము గా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళి వారి అవసరాలను తెలుసుకుని, వాటికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించి సచివాలయాల్లో నమోదు చేయిస్తారన్నారు. వీటిని మంజూరు చేయడం కోసం జులై 1 వ తేదీన ప్రత్యేక శిబిరం (క్యాంప్ డే) నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం, జూన్, డిసెంబర్ నెలల్లో ఇలాంటి ప్రత్యేక శిబిరం (క్యాంప్ డే) లు నిర్వహించి, అర్హులై, లబ్ది పొందాక పోయిన వారికి రేషన్ కార్డుల నుంచి, వివిధ సర్టిఫికెట్లు, అర్హతా ధ్రువపత్రాలు అందచేయడం జరుగుతుందన్నారు.
“గ్రామ,వార్డు సచివాలయాల” వ్యవస్థకు అనుబంధంగా 10 వేల 641 “రైతు భరోసా కేంద్రాలు” రైతుల విత్తనాలు మొదలు, ఉత్పత్తులు అమ్మకాల వరకు అన్ని రకాల సేవలు అందితున్నాయన్నారు. వీటిలో ఒక “డిజిటల్ కియోస్క్” ఏర్పాటు చేశామని, రైతులకు ఇక్కడ తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వంటి వ్యవసాయ ఇన్ పుట్స్, ట్రాక్టర్, హార్వెస్టర్, ఎగరపోత యంత్రం వంటి యంత్రాలు ఆర్డర్స్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు. ఈ కియోస్క్ లోనే ఒక టి.వి. ఏర్పాటుచేసి వ్యవసాయ రంగంలో ఆధునిక ఆవిష్కరణలు వివరాలు శాస్త్రవేత్తలతో చెప్పించిన అంశాలను రైతుల అవగాహన కోసం ప్రదర్శింప చేస్తున్నామని పేర్కొన్నారు. వీటికి అనుబంధంగా “మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాలు” కనీస మద్దతు ధర పొందేందుకు వీలుగా రైతుల ఉత్పత్తులు భద్రపరుచుకునే ఏర్పాటుచేశామన్నారు. సమగ్ర వ్యవసాయ ప్రయోగ శాలల ఏర్పాటు చేసి భూ సార పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు.
గ్రామం లోనే వైద్య సేవలు లభించే విధంగా “గ్రామ,వార్డు సచివాలయాల” వ్యవస్థకు అనుబంధంగా, 10వేల 32 వై.ఎస్.ఆర్ హెల్త్ క్లీనిక్ లు ఏర్పాటుచేశామన్నారు. ఈ వ్యవస్థ కు అనుబంధంగా గ్రామాల్లోనే 10 వేల 961 డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేయడం విప్లవాత్మక చర్య అని ఆయన అభివర్ణించారు. హై బాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చి పౌరులు ఎవరైనా వినియోగించుకునే అవకాశం కల్పించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. మహిళా రైతులు సహకార విధానంలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుకు వీలుగా ఈ సంస్థ కు అనుబంధంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో 3 వేల నాలుగు వందల పాల వెలుగు కేంద్రాలు ప్రారంభించామన్నారు.
బెనిఫిషయరీ అవుట్ రీచ్ ప్రోగ్రాం క్రింద ప్రతి నెల చివరి శుక్ర, శని వారాలు ఏ పథకం క్రింద ఎంత నగదు వారి ఖాతాల్లో జమ అయ్యిందో, ఒకవేళ కాక పొతే సాంకేతిక కారణాలు వివరిస్తూ, వేలిముద్ర తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి బెనిఫిషయరీ అవుట్ రీచ్ ప్రోగ్రాం లు 16 వేల కు పైగా నిర్వహించడం జరిగిందన్నారు.
ప్రజలకు అందుతోన్న సేవల పై గాని, ఇతర సమస్యలపై గాని నేరుగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి కు తెలిపేందుకు “జగనన్నకు చెబుదాం” అనే పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్ “1902” కు ఫోన్ చేస్తే వివరాలు నమోదుచేసుకునేందుకు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. దీనిలో 1200 మంది వాలంటీర్లు పని చేస్తోన్నారన్నారు.
50 ఏళ్ళ ముందుగా ప్రజల సౌకర్యాన్నిఊహించి గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థను ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ఏర్పాటు చేశారని, ఈ వ్యవస్థ ను విమర్శించడం సహేతుకం కాదని జర్నలిజం విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా డైరెక్టర్ లక్ష్మిశ పేర్కొన్నారు.
అంతకు ముందు “మీడియా నాడు – నేడు అంశం పై ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ ప్రోగ్రాం హెడ్ ఆకుల మల్లేశ్వర రావు ప్రసంగించారు.
సమావేశానికి సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కోర్సు డైరెక్టర్ ఎల్.వి. కె. రెడ్డి వక్తలను పరిచయం చేశారు. సి.ఆర్. మీడియా అకాడమీ కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు సమన్వయకర్త గా వ్యవహరించారు.