పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-1 వ డివిజన్ 238 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో పేదల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 238 వ వార్డు సచివాలయ పరిధిలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. డి.డి.నాయుడు వీధి సహా రైవస్ కాలువ వెంబడి వీధులలో విస్తృతంగా పర్యటించి 323 గడపలను సందర్శించారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల ప్రజలను పేరుపేరునా పలకరించారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ఆయా కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం అందుతున్న తీరుపై సమీక్షించి చర్యలు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలకు మరింత సేవలు చేయాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక సమస్యలపై గ్రీవెన్స్ స్వీకరించారు. డి.డి.నాయుడు వీధిలో వర్షపు నీరు నిలిచిపోకుండా చూడాలని ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు. అలాగే వీధిలో ఎక్కడా త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సచివాలయ పరిధిలో రూ. 4.50 కోట్ల సంక్షేమం
ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని, ప్రతి మహిళ సొంత కాళ్లపై నిలబడేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. నవరత్నాల కార్యక్రమాల ద్వారా సచివాలయ పరిధిలో అక్షరాలా 4 కోట్ల 50 లక్షల 78 వేల 461 రూపాయల సంక్షేమాన్ని నాలుగేళ్లలో అందజేసినట్లు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 267 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 196 మందికి రూ. 47.98 లక్షలు., చేయూత ద్వారా 49 మందికి రూ. 16.68 లక్షలు., కాపు నేస్తం ద్వారా 58 మందికి రూ. 22.65 లక్షలు., వాహనమిత్ర ద్వారా 31 మందికి రూ. 6.90 లక్షలు., జగనన్న తోడు ద్వారా 35 మందికి రూ. 5.70 లక్షల ఆర్థిక సాయాన్ని ఇప్పటివరకు అందజేసినట్లు వివరించారు. అలాగే పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 207 మందికి సచివాలయ పరిధిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబు జీవితం అబద్ధాలమయం
ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయ జీవితమంతా అబద్ధాలమయమని మల్లాది విష్ణు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. బాబు చేసేవన్నీ బురదజల్లే, మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమాలని ధ్వజమెత్తారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీ వెంట ఉన్నారన్న దుగ్ధతో నీచ రాజకీయాలకు తెరదీస్తున్నారన్నారు. రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలను బూతద్ధంలో చూపుతూ.. అరాచకాలు జరిగిపోతున్నట్లు ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో దళితులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలపై జరిగినన్ని దాడులు మరే ప్రభుత్వంలోనూ జరగలేదని మల్లాది విష్ణు ఆరోపించారు. ధైర్యముంటే టీడీపీ హయాంలో ఎంతమంది పేదలకు మేలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిన్న మొన్నటి వరకు పేదలకు ఇళ్ల స్థలాలు సైతం వద్దంటూ కోర్టుల్లో కేసులు వేసిన బాబు అండ్ కో.. ఇప్పుడు పేదల జపం అందుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటూ కుట్రలు పన్నుతున్నారని నిప్పులు చెరిగారు. అయినప్పటికీ నమ్మిన సిద్ధాంతాలను వాస్తవ రూపంలోకి తీసుకువస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు మంచి చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. 2024లో 175 స్థానాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు ఉద్ధంటి సురేష్, కొండా మహేశ్వర్ రెడ్డి, బండి వేణు, కనకారావు, కొలకలేటి రమణి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *