– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వద్దకే అత్యంత పారదర్శకంగా పరిపాలన తీసుకువచ్చే గొప్ప కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ అరండల్ పేటలోని 96 సచివాలయంలో సోమవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమై.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే మహోన్నత కార్యక్రమమే జగనన్న సురక్ష అని మల్లాది విష్ణు అన్నారు. అర్హులైన వారికి సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పథకాలు అందకుంటే వారిని గుర్తించి లబ్ధి చేకూర్చడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. తొలిరోజు నిర్వహించిన క్యాంపుల ద్వారా దాదాపు 1,200 మందికి వివిధ సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు. ఈ డివిజన్లోని 3 సచివాలయాల పరిధిలో 639 వినతులు రాగా.. వీరిలో 246 మంది క్యాస్ట్ సర్టిఫికెట్లు., 346 మంది ఇన్ కం., 10 మంది బియ్యం కార్డుల కోసం అర్జీలు సమర్పించినట్లు వెల్లడించారు. వీరందరికీ ఆయా సర్టిఫికెట్లను పూర్తి ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. అర్హత ఉండి సంక్షేమ పథకం అందలేదన్న మాట పేదోడి నోట వినిపించరాదన్న తపనతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, సెంట్రల్ ఎమ్మార్వో శ్రీనివాస్ వెన్నెల, స్పెషల్ ఆఫీసర్ సీహెచ్ బాబూ శ్రీనివాసరావు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.