– నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా కిడ్నీ మార్పిడి చికిత్స
– కిడ్నీ క్రయవిక్రయాలతో ఆసుపత్రికి ఏ సంబంధం లేదు
– దాత, గ్రహీతలిరువురూ తాము భార్యాభర్తలమని ధ్రువపత్రాలు సమర్పించారు
– డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండానే కిడ్నీ మార్పిడి చికిత్స
– భవిష్యత్తులో మరింత జాగరూకతతో వ్యవహరిస్తాం
– శరత్స్ ఇనిస్టిట్యూట్ అధినేత, ప్రముఖ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ జి. శరత్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి వచ్చిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, నిబంధనలకు అనుగుణంగానే సదరు కిడ్నీ మార్పిడి చికిత్సను నిర్వహించామని శరత్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత, ప్రఖ్యాత కిడ్నీ మార్పిడి చికిత్సా నిపుణులు డాక్టర్ జి. శరత్ బాబు వెల్లడించారు. ఆసుపత్రిలో నిర్వహించిన కిడ్నీ మార్పిడి చికిత్స గురించి ఏలూరు కేంద్రంగా ఇటీవల వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో, వాస్తవాలను వెల్లడించేందుకు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. సూర్యారావుపేటలోని శరత్స్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జి. శరత్ బాబు మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రుకు చెందిన యర్రంశెట్టి ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించామని అన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చికిత్స పూర్తిచేశామని తెలియజేశారు. అవయవ దానంలో ఎటువంటి ఆర్ధిక లావాదేవీలకు తావుండదని, అవయువాల క్రయ విక్రయాలకు పాల్పడినవారు చట్టప్రకారం శిక్షార్హులని వెల్లడించారు. ఉదయ్ కిరణ్ భార్య అయిన అనురాధ నుంచి కిడ్నీ దానమిస్తున్నట్లుగా అంగీకారపత్రం తీసుకున్నామని, సదరు అంగీకారపత్రంపై ఆమె తల్లి కూడా సాక్షి సంతకం చేశారని తెలిపారు. కిడ్నీ దాత, గ్రహీతలిరువురూ భార్యాభర్తలని నిర్ధారించేలా రెవెన్యూ, పోలీసు శాఖ వారిచ్చిన ధ్రువపత్రాలను సమర్పించారని, వాటితో పాటు ఇరువురి ఆధార్ వివరాలను పరిశీలించిన మీదటే తాము కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించామని వివరించారు. తమ ఆసుపత్రిలో ఇప్పటివరకు అనేక కిడ్నీ మార్పిడి చికిత్సలను నిర్వహించామని, పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు లోబడి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేస్తున్నామని అన్నారు. ఇకపై నిర్వహించే కిడ్నీ మార్పిడి చికిత్సల విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరిస్తామని, స్వతంత్ర సంస్థ ద్వారా సమీక్ష జరిపించిన అనంతరమే కిడ్నీ మార్పిడి చికిత్సలు నిర్వహిస్తామని చెప్పారు. తమ ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ శరత్ తెలియజేశారు. ఈ సమావేశంలో హాస్పిటల్ చైర్మన్ జి. వెంకట్రావు, శరత్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు డాక్టర్ ఎన్. హరిప్రసాద్, డాక్టర్ సీహెచ్ దుర్గానాథ్, డాక్టర్ జి. ప్రశాంతి పాల్గొన్నారు.