– నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లపై నిబంధనల మేరకు చర్యలు: కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం ఆప్షన్-3 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు కృషిచేయాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరు చేసిన ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాల్లో పురోగతిపై కలెక్టర్ డిల్లీరావు.. విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్పిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్‌తో కలిసి హౌసింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల లబ్ధిదారులకు సంబంధించిన లేఅవుట్లలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ల వారీగా మ్యాప్ చేసిన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను పరిశీలించారు. పనులను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 10,991; తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 7,781; పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 9,608 ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చించారు. ఈ సంద్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ సరైన పురోగతి చూపని కాంట్రాక్లరపై సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి.. తగిన పరిష్కారం చూపి ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని.. లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అధికారులను కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రజనీకుమారి, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు హాజరయ్యారు.