-రక్షణ ఏర్పాట్లు పటిష్టం చేస్తాం…
-క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం…
-భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్ లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పండిట్ నెహ్రూ బస్టాండ్ మూడు దశాబ్దాల చరిత్రలో ఎన్నడు ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదని, సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
నెహ్రూ బస్ స్టేషన్ లో ప్రమాద ఘటన జరిగిన ప్లాట్ ఫారం పరిసర ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో ఈ తరహా ప్రమాదాల నియంత్రణ కోసం తీసుకోవలసిన రక్షణ చర్యల అంశాలను చర్చించారు. ప్రధానంగా ప్లాట్ ఫామ్ ల ఎత్తు పెంచడం, బస్సులలో నైపుణ్యం కలిగిన డ్రైవర్లను నియమించే విషయంలో జాగ్రత్తలు పాటించడం, ప్రతి బస్సు కండిషన్ లో ఉండేలా చూడటం, బస్సుల మరమ్మతు విభాగాన్ని పటిష్ట పరచడం వంటి చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా నియంత్రించేందుకు అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. ప్రమాదంలో క్షతగాత్రులైన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రమాద ఘటన కారణాలపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. ఈ తరహా ఘటనలు మరే ప్రాంతంలోనూ చోటు చేసుకోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయం తీసుకుని ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు నష్ట పరిహారం అందించడం జరిగిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
పరిశీలనలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ యంవై. దానం ఉన్నారు.