– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా పీవీ నరసింహారావు సేవలకుగానూ అందుకోవడం తెలుగుజాతికి, బ్రాహ్మణ్యానికి గర్వకారణమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశ సమగ్రాభివృద్ధికి పీవీ అందించిన సేవలను ఈ సందర్భంగా మల్లాది విష్ణు స్మరించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను తన సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి పాములపర్తి వేంకట నరసింహారావు అని కొనియాడారు. శాసనసభ్యునిగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా, నిరంతర సంస్కరణశీలిగా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. మన దేశం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కి ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదిగిందంటే కేవలం ఆయన చలవేనని మల్లాది విష్ణు అన్నారు. ఆయన బహుభాషా కోవిదుడని.. 14 భాషలు మాట్లాడగలిగిన ఏకైక ప్రధాని అని చెప్పుకొచ్చారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమని కీర్తించారు. దేశ చరిత్రలో నిరంతర సంస్కరణ శీలిగా పీవీ నరసింహారావు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూసంస్కరణలకు ఆయనే ఆద్యులని.. భూసంస్కరణల్లో భాగంగా తన ఆస్తిని ప్రభుత్వానికి అప్పగించినటువంటి మహోన్నత వ్యక్తి అని చెప్పారు. అంతర్గత భద్రత వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాల్లోనూ పీవీ అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి.. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పటిష్ఠపరిచిందన్నారు. ఆర్థిక, విద్య, భూపరిపాలన తదితర రంగాలలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతోను.. ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ నగరంతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉండేదని ఎమ్మెల్యే అన్నారు. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భావితరాలు పీవీ సేవలను స్మరించుకునే విధంగా సత్యనారాయణపురంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఎన్నికల అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా విగ్రహావిష్కరణ ఉంటుందని తెలియజేశారు.