విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఐ.పి.ఎస్., శనివారం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో పోలీస్ కమిషనర్ ఈ రోజు కార్యాలయం లోని పలు విభాగాలు అయిన సిటి స్పెషల్ బ్రాంచ్, పాస్ పోర్ట్స్ వింగ్, సిటి క్రైమ్ రికార్డు బ్యూరో, సైబర్ సెల్, ఐ.టి.కోర్ వింగ్, ఫింగర్ ప్రింట్ యూనిట్, పరిపాలనా విభాగాలను పరిశీలించి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు సలహాలను అందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…. స్పెషల్ బ్రాంచ్ వారితో అక్రమ రవాణా మరియు అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి నిఘా పెంచి వాటి పూర్తిస్థాయి నియంత్రణ చర్యలపై మరియు రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం సేకరించి అధికారులకు తెలియజేయాలని, పాస్ పోర్ట్ తీసుకొనుటకు పెట్టిన ఆర్జీలను త్వరితగతిన విచారించి ఎక్కడా ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని, సిటి క్రైమ్ రికార్డు బ్యూరో సిబ్బందితో అన్ని పోలీస్ స్టేషన్ల నుండి ఖచ్చితమైన క్రైమ్ రికార్డులను, ముఖ్యమైన కేసుల దర్యాప్తులు ఏ దశలో ఉన్నాయో వాటి వివరాలను ఎప్పటికప్పుడు సేకరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు మరియు సలహాలను అందించడం జరిగింది.
అనంతరం ట్రాఫిక్ పరంగా బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు, నిడమానూరు, గూడవల్లిలలో ఇరుకైన రద్దీ ప్రాంతాలను పరిశీలించి ప్రజలు మరియు ప్రముఖుల రాకపోకలలో ఎటువంటి అంతారాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తో పాటు డి.సి.పి. కె.చక్రవర్తి, ఎస్.బి.ఏ.సి.పి.లు కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్, బి.పార్థసారథి, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.