-వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత
-బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామం
-రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం, అమరావతికి మంచి రోజులు వచ్చాయని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర రైతాంగం కలల ప్రాజెక్టు పోలవరానికి ఆర్థిక తోడ్పాటు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించడం, వెనుకబడిన ప్రాంతాలకు – రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించడం పట్ల NDA ప్రభుత్వానికి, ప్రధాని మోదీ కి అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.
గడిచిన ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలన, ప్రజల సమస్యల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ఈ కేటాయింపులు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాది వ్యవసాయానికి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. ఉత్పాదకత పెంపుపై దృష్టి సారించడం, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహంతో పప్పుధాన్యాలు మరియు నూనెగింజల కోసం మిషన్ల ఏర్పాటు.. ప్రజల ఆరోగ్యం పరిరక్షణకు కూరగాయల ఉత్పత్తి కోసం భారీ స్థాయిలో క్లస్టర్‌లను వినియోగ కేంద్రాల దగ్గరలో అభివృద్ధి చేసేందుకు కృషి.. కూరగాయల సాగులో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు, ప్రోత్సాహం.. కూరగాయల విలువ ఆధారిత ఉత్పత్తి తయారీలో స్టార్టప్‌లు, సహకార వ్యవస్థను బలోపేతం చేయడం వంటి కీలక నిర్ణయాలు ఎన్నో ప్రయోజనాలు కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు.
DPI ఉపయోగించి డిజిటల్ పంట సర్వే, రొయ్యల ఉత్పత్తి & ఎగుమతి, నేషనల్ కోపరేటివ్ పాలసీ అనుసరించి నాబార్డు ప్రోత్సహంతో ఆక్వా ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో అభివృద్ధికి ప్రత్యేక చర్యలతో పాటు జాతీయ సహకార విధానం ద్వారా సహకార వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి చర్యలు వంటి సంస్కరణలు ఎంతగానో మేలు చేకూరుస్తాయని అభిప్రాయపడ్డారు.