-ప్రజల సొమ్ముతో వ్యక్తిగత లక్ష్యాలు దుర్మార్గం
-ప్రేముంటే స్థలం కొని పార్కు ఏర్పాటుచేసుకోవాలి
-మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని వెనకుండి అంతా నడిపించారు
పార్కు పేరు మార్పు, విగ్రహం ఏర్పాటులో అక్రమాలు బయటపెడతాం
-గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పార్కు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టే ప్రశక్తే లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో యర్రా నాగేశ్వరరావు పేరుతో పార్కు ఏర్పాటుపై వచ్చిన కథనాలపై మీడియాతో మాట్లాడారు. అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో పార్కు ఉండగా.. బలవంతంగా నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి తన తండ్రి పేరు పెట్టుకోవడాన్ని ఆక్షేపించారు. నియోజకవర్గానికి అతను చేసిన సేవలేమీ లేకపోయినా, నాటి ఎమ్మెల్యే పేర్ని నాని, శ్రీ లక్ష్మి కలిసి పేరు మార్చేశారన్నారు. పైగా గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ నిధుల నుండి రూ.2 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన రూ.18 లక్షలు ఖర్చు చేయడం దుర్మార్గం అన్నారు. తండ్రి విగ్రహం పెట్టాలనే ఆలోచన ఉంటే సొంత ఖర్చుతో పెట్టుకోవాలని గతంలోనే చెప్పామని, కానీ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. గతంలో మచిలీపట్నం పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వం పలు పార్కుల్ని అభివృద్ధి చేసింది. వాటిని తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. ఎంత నిర్లక్ష్యం చూపారంటే.. కలెక్టర్ కార్యాలయం, కలెక్టర్ బంగ్లాకు మధ్యన ఉండే పార్కును పట్టించుకోకపోవడంతో గేటు కూలి ఒక పిల్లాడు చనిపోయే పరిస్థితికి కారణమయ్యారన్నారు. అదే సమయంలో పంచాయతీరాజ్ పరిధిలో ఉండే పార్కుకు కొనకళ్ల గణపతిరావుపేరు పెట్టాలని భావించి, మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేశాం. కానీ తర్వాతి ప్రభుత్వం పట్టించుకోలేదు.పార్కు విషయంలో జరిగిన అక్రమాలన్నింటిపైనా విచారణ జరిపిస్తాం. ఎంత ఖర్చు చేశారో, ఎంత తిన్నారో మొత్తం బయటకు లాగుతాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాల గుట్టు బయటపెడతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.