-అవయవ దానంపై విస్తృత ప్రచారాన్ని కల్పించాలి
-ప్రజల్లో అపోహల్ని తొలగించాలి
-అంత్యక్రియల ఖర్చుగా రూ.10 వేలు ప్రభుత్వ సాయం
-రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తన అవయవాలను దానం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సభా వేదిక సాక్షి గా ప్రకటించారు. అంగీకార పత్రంలో సంతకం చేయడంతో పాటు ప్రతిజ్ఞ కూడా చేశారు. అవయవ దానం చేస్తున్నట్లు సభా వేదిక పైనుండి మంత్రి వెల్లడించడంతో అందరూ లేచి నిలబడి కరతాళ ద్వనులతో తమ హర్షాన్ని వ్యక్తపరిచారు. అవయవదానంపై గ్రామ స్ధాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని మరింత చైతన్యవంతుల్ని చేయాలన్నారు. ఏపీ జీవన్‌ధాన్ ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదానం దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడలోని పాత ప్రభుత్వం ఆసుపత్రి నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో డీఎంఈ ఎస్‌విఎస్‌ఎల్ నరసింహం, ఏపీ జీవన్‌ధాన్ పధకం రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవయవ దానం అవగాహనా. సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.రాంబాబు అవయవ దానం అవశ్యకత, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో అవగాహన తక్కువుగా ఉందని, చాలా మంది రోగులు సకాలంలో అవయవాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రధానంగా ప్రజల్లో అవగాహన లేకపోవడమే కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అవయవదానం చేసిన వ్యక్తుల కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల కింద రూ.10వేల రూపాయలు అందించాలని ఆయా రాష్ట్రాలకు సూచించిందని, దీనిని ఇక నుంచి అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మరింత ప్రచారం చేయాలన్నారు. ఇటీవల కాలంలో పలు ప్రమాదాల కారణంగా బ్రెయిన్‌డెడ్ అయిన వారి అవయవాల్ని దానం చేసిన కుటుంబ సభ్యులను మంత్రి సత్యకుమార్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. జీవన్‌ధాన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు, డిఎంఇ డాక్టర్ డిఎస్వియల్ నరసింహం, జిజిహెచ్ విజయవాడ, గుంటూరు సూపరింటెండెంట్లు డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, డాక్టర్ వై.కిరణ్ కుమార్, విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.