-పుట్టిన బిడ్డకు చనుబాలుకు మించిన ఔషదం మరోకటి లేదు..
-తల్లిదండ్రులు నమ్మకం కలిగేలా అంగన్‌వాడీలను తీర్చిదిద్ధుతాం..
-ప్రైవేట్ ప్లేస్కూల్స్‌కి ధీటుగా అంగన్‌వాడీలలో మౌలిక వసతులు
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుట్టిన నాటి నుండి తల్లి పాలుఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని చనుబాలుకు అవసరమైన ఔషదం మరోకటి లేదని తల్లిపాలుపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రైవేట్ ప్లేస్కూల్స్‌కి ధీటుగా మౌలిక వసతులు కల్పించి ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను అంగన్‌వాడీలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అన్నారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ డా. జి. సృజన గుణదల క్రీస్తురాజుపురం లోని అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి చిన్నారులతో ముచ్చటించిన అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించి పోష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్శంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన నాటి నుండే బిడ్డకు తల్లి చనుబాలును తప్పక అందించాలన్నారు. తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని రోగనిరోధక శక్తి అధికంగా ఉండే తల్లి పాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమన్నారు. తల్లిపాలపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. నేటి సమాజంలో మహిళలు సౌందర్యం తగ్గుతుందనే అపోహతో పాటు బిడ్డలకు చనుబాలు ఇవ్వకుండా పోతపాలను పడుతున్నారన్నారు. పోతపాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదన్నారు. తల్లిపాలలో ఉండే పోషకాలు తల్లి బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్నారు. తల్లిపాలు మాత్రమే నవజాత శిశువులకు అయోడిన్ పొందేందుకు ఏకైక మార్గమన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి వెయ్యి రోజులు కీలకమని శిశువుల మెదడు మరియు శారీరక అవయవాల అభివృద్ధికి అయోడిన్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. శిశు మరణాలు, మెంటల్ రిటార్డేషన్, కుంగిపోయిన ఎదుగుదల ఎండిమిక్ గాయిటర్ హైపోథైరాయిడిజం మొదలైన వాటి ప్రమాదం నుండి తల్లిపాల ద్వారా మాత్రమే రక్షణ కల్పిస్తుందన్నారు. జిల్లాలో 1475 అంగన్‌వాడీల ద్వారా 10,251 మంది గర్భిణీలకు, 7,125 బాలింతలతో పాటు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల 50,633 మంది చిన్నారులకు, 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు కలిగిన 48,009 చిన్నారులకు సంపూర్ణ పోష్టికాహారంతో పాటు ఆటపాటలు విద్యాబుద్దులు నేర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మహిళా శిశు సంక్షేమం అంగన్‌వాడీల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రైవేట్ నర్సరీ స్కూల్స్‌కి ధీటుగా అంగన్‌వాడీ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులను కల్పించడంతో పాటు మరింత ఆరోగ్యవంతమైన పోష్టికాహరాన్ని అందించాలన్న ఆలోచన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. సృజన తెలిపారు.
జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారిణి జి. ఉమాదేవి మాట్లాడుతూ తల్లిపాలు విశిష్టతను చాటిచెప్పెందుకు వైద్యుల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించడం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే వారోత్సవాలలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ర్యాలీలు, గృహా సందర్శనలు, గర్భీణీలకు సాముహిక సీమంతాలు, పోష్టికాహార పంపిణీ, ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య జాగ్రత్తల పై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.
కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ సిడిపివో జి. మంగమ్మ, సూపర్‌వైజర్ రెహన, పిన్నమనేని సిద్దార్థ వైద్యాశాల మెడికల్ ఆఫీసర్ డా. పద్మజ చౌదరి, జూనియర్ మెడికల్ ఆఫీసర్ డా. మాదురి, డా. శశి, డా. దీప్తి, డా. శ్రీతేజ, సోషల్ వర్క్ నిస్సార్‌బేగం, అంగన్‌వాడీ కార్యకర్తలు, పాల్గొన్నారు.