2025 జూన్ నాటికి రామాయపట్నం పోర్టు పూర్తికి చర్యలు

-పోర్టు పనులపై ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లతో ఉమ్మడి సమీక్ష
-అలసత్వం వహిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లకు మంత్రి బీసీ హెచ్చరిక
-ప్రతినెల రివ్యూ…ఫలితం కనిపించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి ఆదేశాలు

రామాయపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రారంభ సమయంలో అనుకున్న విధంగా 2025 జూన్ నాటికి పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. పోర్టు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఉమ్మడి సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణం పనులపై మంత్రులకు కాంట్రాక్టర్లు, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు చేసిన పనుల వివరాలను, చేయాల్సిన పనుల వివరాలను, పెండింగ్ పనులకు సంబంధించిన పలు సమస్యలను మంత్రుల దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ..ముఖ్యమంత్రి చంద్రబాబు రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్న విషయాన్ని అధికారులకు వివరించారు. పోర్టు నిర్మాణంలో నెలకొన్న వివిధ అడ్డంకులు, సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన పనులు ఒక ఎత్తు అయితే…రానున్న కాలంలో ప్రతినెల నిర్మాణ పనులపై తప్పనిసరిగా రివ్యూ చేస్తానని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. పని విధానంలో ప్రోగ్రెస్ కనిపించకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై తగు రీతిలో చర్యలు తప్పవని గుర్తు చేశారు. భూములకు సంబంధించిన పనలు సమస్యలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోర్టు పనులు శరవేగంగా పూర్తి కావాలని, దానికి అవసరమైన సహాయ, సహకారాలు ప్రభుత్వం నుండి తీసుకోవాలని అధికారులకు తెలిపారు. సమీక్ష సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశించారు. సమీక్ష అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు పోర్టు పనులను పరిశీలించారు. పోర్టు పనులకు సంబంధించిన వివరాలపై మంత్రులకు అధికారులు, కాంట్రాక్టర్లు మ్యాప్ చూపించి వివరించారు. పనుల పరిశీలన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు..
పోర్టును త్వరగా పూర్తి చేసి తెలుగు ప్రజల కల నెరవేరుస్తాం, బీసీ జనార్ధన్ రెడ్డి:-
‘‘రామాయపట్నం పోర్టు తెలుగు ప్రజల చిరకాల కోరిక. ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభివృద్ధి, రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పోర్టు నిర్మాణానికి 2019లో శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం మారడం వల్ల నిర్మాణ పనులు గత ఐదేళ్లు నత్త నడకన సాగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రామాయపట్నం పోర్టును త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు 51శాతం పనులు పూర్తయ్యాయి. రూ.1,300 కోట్లు ఖర్చు చేశారు. పోర్టు నిర్మాణం పూర్తి వ్యయం అంచనా రూ.4,929.39 కోట్లు. పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల నుండి తీసుకున్నాం. ప్రతి నెల పనులపై రివ్యూ నిర్వహిస్తాం. పనుల్లో ఎక్కడైనా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. అనుకున్న గడువులోపు పనులు పూర్తి చేయించి, తెలుగు ప్రజల కోరిక నెరవేర్చేందుకు చంద్రబాబు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు’’ అని మంత్రి జనార్ధన్ రెడ్డి అన్నారు.
రామాయపట్నం పోర్టు రాష్ట్రానికి ఓ వరం, మంత్రి ఆనం:-
‘‘రామాయపట్నం పోర్టు రాష్ట్రానికి ఓ వరం. పోర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయితే ఇక్కడ అనేక మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుంది. గత ఐదేళ్లు పోర్టు పనులను నిర్వీర్యం చేసిన వాళ్లు సిగ్గు లేకుండా మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పెన్షన్లు, జీతాలు ఇవ్వలేమని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండవ నెల పెంచిన పెన్షన్లను ఒకటో తారీఖునే 98శాతం ఇచ్చి మా ప్రభుత్వం సత్తా ఏంటో చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. చేతకాని వాళ్లు విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రామాయపట్నంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రతినెల రివ్యూ పెట్టి పనులను వేగవంతం చేసేలా చూస్తానని చెప్పడం తన బాధ్యతల పట్ల మంత్రికి ఉన్న అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం’’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, మారిటైం బోర్డు సీఈఓ సీ.వీ.ప్రవీణ్ ఆదిత్య, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరుజిల్లా కలెక్టర్ ఆనంద్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యావతి, పోర్టు నిర్మాణం ప్రాజెక్టు డైరెక్టర్ పెరుమాళ్లు, జిల్లా స్థాయి అధికారులు, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, స్థానిక టీడీపీ నాయకులు అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *