-500 ఉత్తమ ప్రాజెక్టుల్లో 35 స్థానాలు మన రాష్ట్రానివే
-రెండో ర్యాంకు సాధించిన తక్కువ ఖర్చుతో సెలైన్ అలారం (Empty Saline Remainder)ప్రాజెక్టు రూపొందించిన శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి ఉన్నత పాఠశాల విద్యార్థులు
-అభినందించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీతి ఆయోగ్ వారి అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న అటల్ మారథాన్ లో భాగంగా 2023-24 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ప్రాజెక్టు పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ర్యాంకు దక్కిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది డిసెంబరు 01 నుండి ఈ ఏడాది జనవరి 26 వరకు దేశవ్యాప్తంగా 2000 ప్రాజెక్టులు సమర్పించగా వాటిల్లో 500 ఉత్తమ ప్రాజెక్టులు ర్యాంకులు వారీగా ఎంపికయ్యాయని, అందులో మన రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులు 35 ఎంపిక జాబితాలో ఉన్నాయని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటినందుకు ర్యాంకులు సాధించిన బృందాలతో పాటు, ప్రాజెక్టులు సమర్పించిన అన్ని పాఠశాలల విద్యార్థులకు, సహకరించిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
తమ చుట్టూ ఉన్న సమస్యలనే ఆసరాగా చేసుకుని పాఠశాలలో ఉన్న అటల్ టింకరింగ్ లాబ్ లోని పరికరాలను విద్యార్థులు ఉపయోగించి వినూత్న ఆలోచనలకు నాంది పలకడం ఆనందదాయకమని, రాబోయే కాలంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు సృష్టించి మన రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు కోరారు. రాష్ట్రం లోని అటల్ టింకరింగ్ లాబ్ లను ఉపయోగం లోకి తీసుకువచ్చి, టీచర్స్, విద్యార్థులకు కార్యశాలలను యునిసెఫ్ మరియు విజ్ఞాన్ ఆశ్రమం సంస్థల సహాయంతో నిర్వహిస్తున్నామని తెలియచేశారు. ఇక ముందు కూడా అన్ని అటల్ లాబ్ లను ఉపయోగంలోకి తీసుకువచ్చి వాటిని విద్యార్థులు ఉపయోగించెలా నోడల్ టీచర్స్ మరియు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్ పాటుపడాలని సూచించారు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ ప్రాజెక్టులు అటల్ మారథాన్ కి పంపాలని కోరారు.
తక్కువ ఖర్చుతో సెలైన్ అలారం (Empty Saline Remainder) ప్రాజెక్టుకు రెండో ర్యాంకు
శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన తక్కువ ఖర్చుతో సెలైన్ అలారం (Empty Saline Remainder)ప్రాజెక్టుకు రెండో ర్యాంకు దక్కింది. ఈ ప్రాజెక్టు ఆ పాఠశాల బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఎస్.ఉమామహేశ్వరి మార్గదర్శకత్వంలో పదో తరగతి చదువుతున్న డి. నవీన్ కుమార్ బృంద నాయకునిగా, జె.ఎస్.హాసిని, హరి సింహాద్రి రూపొందించారు.
ఈ ప్రాజెక్టు ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ
Empty Saline Remainder వినియోగం ఇదీ.. ఆసుపత్రిలో పేషెంట్ కి సెలైన్ ఎక్కిస్తున్నప్పుడు రోగి సహాయకులు గానీ, నర్స్ గానీ ఏదైనా కారణం చేత గమనించకపోతే.. రోగి శరీరం నుండి రక్తం సెలైన్ పైపులోకి వస్తుంది. ఆ సమయంలో పేషెంట్, సహాయకులు భయాందోళన చెందాల్సి వస్తుంది. అలాగే పేషెంట్స్ కి ఎక్కువ రక్తం కోల్పోతారు. ఈ సమస్య నివారించడానికి సెలైన్ 5 మి.లీ.ఇంకా మిగిలి ఉండగా అలారం (సెలైన్ రిమైండర్ )మోగుతుంది. దీనివల్ల పేషెంట్ రక్తం నష్టం వాటిల్లకుండా, భయందోళన చెందకుండా కాపాడవచ్చు. ఈ ఆలోచన అన్ని ఆసుపత్రిల్లోనూ, ఇళ్ళలోనూ ఉపయోగించవచ్చు. ఖర్చు తక్కువ లాభం ఎక్కువ. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు అయిన ఖర్చు రూ. 280.
కావలసిన పరికరాలు :
స్ప్రింగ్ త్రాసు, అలారం, led బల్బ్, వైర్లు, స్విచ్, బాటరీ టేప్, కాపర్ వైర్.
ఏపీ సాధించిన ర్యాంకులివే:
2, 42, 59, 66, 114, 115, 117, 122, 129, 137, 165. 169, 196, 244, 247, 251, 261, 266, 272, 273, 287, 306, 368, 376, 392, 393, 424, 427, 436, 441, 443, 453, 457, 466, 478.