-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన లబ్దిదారులు ఇళ్ళ కేటాయింపులో చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వమే చెల్లించి సొంతింటి కలను నేరవేర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన తెలిపారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌యం పథకం కింద ఇంటిని కేచాయించేందుకు లబ్దిదారులు చెల్లించాల్సిన వాటా కింద గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహయాన్ని శనివారం కలెక్టర్ జి. సృజన, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి జె. సునీతలు కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్ నందు లబ్దిదారులకు చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ అజిత్‌సింగ్ నగర్ సమీపంలో నివాసం ఉంటున్న గిరిజన సామాజికవర్గం (ఎరుకుల)కు చెందిన ట్రాన్స్‌జెండర్ పాలపర్తి గౌరి, విభిన్నప్రతిభావంతురాలు మిండ్యాల మరియమ్మలకు ప్రభుత్వం జెఎన్‌ఎన్‌యుఆర్‌యం పథకం కింద రాజరాజేశ్వరిపేటలో ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందన్నారు. దయనీయ ఆర్థిక పరిస్థితి ఉన్న లబ్దిదారులు గృహాలను పొందేందుకు లబ్దిదారుల వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేని స్థితిలో ఉన్నామని ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేయాలని ధరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. లబ్దిదారుల పరిస్థితిని గుర్తించి గిరిజన సంక్షేమ శాఖ నుండి ఒక్కొక్కరికి 66 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి గృహ నిర్మాణాన్ని చేయడం జరిగిందని ఆమె తెలిపారు. లబ్దిదారులు చెల్లించాల్సిన వాటా కింద ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని నేరుగా నగరపాలక సంస్థకు చెల్లించి రాజరాజేశ్వరిపేటలో గృహాన్ని కేటాయించి సొంత ఇంటి కలను నేరవేర్చినట్లు జిల్లా కలెక్టర్ జి. సృజన తెలిపారు.