Breaking News

గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు.. త్వరలో కొత్త చట్టం..

-చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి..
-కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు..
-సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు..
-నేటి నుంచే వ్యవస్థలో మార్పు రావాలి.. లోపాలు సరిదిద్దాలి..
-సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ..
-ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభం..
-కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాలా సేవలందిస్తామని.. అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వానికైనా, ప్రజలకైనా వ్యవసాయం మరియు సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవి అన్నారు. ఈ రంగాలు లేని సమాజాన్ని కూడా ఊహించలేమన్నారు. 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలిక పెట్టడంతో, గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్‌ రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్టచివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని, నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

90 శాతానికి పైగా కౌలు రైతులే వ్యవసాయం..
సొంత రైతులే వ్యవసాయాన్ని వదిలేస్తున్న నేపథ్యంలో, సాగు బాధ్యతను కౌలు రైతులే తీసుకుంటున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో 90 శాతానికిపైగా కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారన్నారు. సీసీఆర్‌సీ పేరిట అనాలోచిత చట్టాన్ని తెచ్చి అన్నదాతలను గత ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. సీసీఆర్‌సీ కార్డులు రాక, ప్రభుత్వ ప్రయోజనాలు అందక, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం రాకతో రైతాంగానికి మళ్లీ మంచిరోజులు రావాలని, వ్యవసాయానికి ఊతమిచ్చేలా సహకార వ్యవస్థ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కౌలు రైతులకు రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాలని, ఇప్పటికే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్బీసీ) సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

నిజమైన రైతులకు రుణాలు ఇవ్వాలి..
ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతులను చుట్టుముట్టడటంతో చేతికొచ్చిన పంట పాడవుతోందని, రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించినా రాబడి లేక అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న నిజమైన రైతులకు రుణాలు ఇవ్వాలని, డిజిటైలేజేషన్ తో అక్రమాలకు తావులేకుండా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రతి రైతు భూమిని వెబ్‌ ల్యాండ్‌లో పెట్టి గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆప్కాబ్ – డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలన్నారు. అన్ని జిల్లాల్లో ఆప్కాబ్ మరియు డీసీసీబీ శాఖలను విస్తరించి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలన్నారు. అలాగే, సహకార బ్యాంకులకు మరియు సంఘాలకు రావల్సిన బకాయిలను అందజేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి శాఖల అడ్మినిస్ట్రేషన్‌లో తనకంటూ ఒక బ్రాండ్ ఉందని.. తాను సేవలందించే శాఖలకు మరింత వన్నె తీసుకురావడమే తన లక్ష్యమన్నారు.

స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ.. సహకార వ్యవస్థలో కేంద్రం ఇటీవల చేపట్టిన సమీక్షలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం సహకార వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి డిజిటైజేషన్ చాలా అవసరమని, అధికారులంతా ఇందుకు తగినవిధంగా సమన్వయంతో పనిచేయాలన్నారు.

అంతకుముందు.. ఆప్కాబ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాట్సప్ బ్యాంకింగ్ సేవలను మంత్రి ప్రారంభించారు. అలాగే, దరఖాస్తు మీద సంతకం చేసి ఇందులో మొట్టమొదటి సభ్యుడిగా చేరారు. అనంతరం 26 జిల్లాల అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులు, సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ, సహకార, సెరీకల్చర్, మార్కెటింగ్ శాఖల స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్.రెడ్డి, ఆప్కాబ్ ఛైర్మన్ ఎ.బాబు, డీసీవోస్, 26 జిల్లాల డీసీసీబీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *