Breaking News

చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు ఉండవ్

-అందరికీ ఉపాధి కల్పనే మా ధ్యేయం
-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి సవిత
-ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ఏటా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్నదే ధ్యేయం
-నిరక్షరాస్యులకు సైతం ప్రభుత్వ సబ్సిడీతో కూడిన రుణాలు
-యూనిట్ల ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అవగాహన కార్యక్రమాలు
-యూనిట్ల సద్వినియోగానికి జిల్లాకో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు : మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పాలన సాగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. శనివారం మంగళగిరిలోని ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్నితనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహాత్ముని స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపులకు తావేలేదన్నారు. నిరుద్యోగులందరికీ ఉఫాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు సబ్సిడీతో కూడిన రుణాలివ్వనున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన లేకపోవడంతో యువత తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా లభ్యం కావడంతో, ఉద్యోగాల్లేక కొందరు యువకులు వాటికి బానిసలయ్యారన్నారు.
ఏటా 25 వేల మందికి ఉపాధి
యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ధ్యేయంతో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి కల్పనకు, ఉద్యోగాల భర్తీకి నడుం బిగించిందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో రుణాలు విరివిగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. విద్యతో సంబంధం లేకుండా నిరక్షరాస్యులకు కూడా ఈ రుణాలివ్వనున్నట్లు తెలిపారు. రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలివ్వనున్నామన్నారు. గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఈ రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, విక్రయాలకు సంబంధించి యూనిట్లకు రుణాలివ్వబోమన్నారు. ఇటుకలు, పేపర్ ప్లేట్లు తయారీ వంటి యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహామందిస్తామన్నారు. ఇలా ఏటా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా 25 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.
జిల్లాకో ట్రైనింగ్ సెంటర్
ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో జిల్లాకో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలోనూ ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి, యూనిట్లపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా కేంద్రాల్లో ఆ యూనిట్ల స్థాపనకు నిరుద్యోగులకు శిక్షణివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అదే సమయంలో ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ఇచ్చే రుణాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
వందరోజుల ప్రణాళికలతో ముందుకు సాగండి…
అంతకుముందు మంగళగిరిలోని ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాలన్ని మంత్రి సవిత సందర్శించారు. ఆ బోర్డు సీఈవో విజయ రాఘవ నాయక్ తో మాట్లాడారు. బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న ఉపాధి అవకాశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసినట్లు వంద రోజుల్లో అభివృద్ధిలో భాగంగా ఏయే ప్రణాళికలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలన్న ధ్యేయంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. ఆయన లక్ష్య సాధనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. అనంతరం ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయం పక్కనున్న ఆప్కో షోరూమ్ ను, గోదామును పరిశీలించారు. చీరలు, ఇతర వస్త్రాలు ఏయే ధరల్లో లభ్యమవుతున్నాయి…రోజూ ఎంత మేర అమ్మకాలు జరుగుతున్నాయి..? అని ఆప్కో ఎండీ పావనమూర్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయ డీడీ వి.రమేష్ బాబు, ఏడీ అబ్దుల్ రషీద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *