మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూర విద్యా విధానం) ద్వారా అందిస్తున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఇన్చార్జి శ్రీదేవి అధికారులకు సూచించారు. సోమవారం డిఆర్ఓ చాంబర్స్ లో విద్యాశాఖ సంబంధిత శాఖల అధికారులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పెంపునకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో ఉద్యోగులు పదోన్నతుల కోసం పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు చేయడానికి ఇది ఎంతో ఉపయోగకంగా ఉంటుందని, కావున వారి వారి శాఖలలో అవసరమైన ఉద్యోగులకు ఈ కోర్సుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా అధికారులు, ఉద్యోగులు వారికి తెలిసిన వారికి ఈ సమాచారం అందించి ఈ కోర్సులలో ప్రవేశాల పెంపునకు కృషి చేయాలని సూచించారు.
విద్యాశాఖ జిల్లా పరీక్షల నిర్వహణ విభాగం అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ రాజు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి విద్యార్హత లేకున్నా 14 సం. నిండిన వారు పదవ తరగతిలో ప్రవేశానికి అర్హులని, 10వ తరగతి పాసైన వారు ఇంటర్మీడియట్ కోర్సు చేయడానికి అర్హులని తెలిపారు. మహిళలు, పలు వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ సంఘ సభ్యులకు ఇదొక చక్కని సదవకాశం అన్నారు. సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహించబడతాయన్నారు. ఈనెల 28వ తేదీలోగా నిర్దేశించిన కోర్సు రుసుం చెల్లించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు పొందవచ్చని, 200 రూపాయల ఫైన్ తో సెప్టెంబర్ 4 వరకు చెల్లించవచ్చన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.