-పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు.వి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించడానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల మూడవ తేదీతో ముగిసింది. ఈ టెట్ పరీక్షలకు అధిక సంఖ్యలో 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1-ఎ కు 1,82,609 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 1- బి కు 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ విభాగంలో పేపర్ 2- ఏ లాంగ్వేజెస్ కు 64,036 మంది మాథ్స్ అండ్ సైన్స్ కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా సోషల్ స్టడీస్ లో70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 2- బి విభాగంలో 2438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టెట్ పరీక్షలు నిర్వహిస్తామని అభ్యర్థులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.