Breaking News

ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ…

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల దాడి హేయమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విగ్రహంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడాన్ని నిరసిస్తూ.. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతలు, అంబేద్కర్ వాదులు ఆందోళన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి కొవ్వొత్తులతో శాంతియుత నిరసన తెలిపారు. బాబా సాహెబ్ ఆలోచనా విధానంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే తలమానికంగా స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ మహాశిల్పాన్ని ఏర్పాటు చేశారని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అర్థరాత్రి లైట్లు ఆర్పివేసి మరీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. పైగా అధికారుల సమక్షంలోనే ఇలాంటి చర్యలకు పూనుకోవడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. రాష్ట్రంలో నీచమైన సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరదీస్తోందని.. ఈ ప్రభుత్వం వచ్చాక విగ్రహాలు, మనుషులపై దమనకాండ ఎక్కువైందని మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి చేయకుండా.. ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. వాగ్దానాలు అమలు చేసి ప్రజల మనసు గెలవాలే తప్ప.. దాడులు చేసి భయపెట్టాలని చూడటం దారుణమన్నారు. పైగా వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన భవనాలు, విగ్రహాలను పగులగొట్టడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. సుత్తులతో భౌతికంగా పేర్లను తొలగించినంత మాత్రాన, ప్రజల హృదయాల నుంచి వైఎస్ జగన్ పేరును తొలగించలేరన్న విషయాన్ని పచ్చనేతలు గ్రహించాలన్నారు. నగరంలో అంబేద్కర్ విగ్రహం లేకుండా చేయాలన్నదే తెలుగుదేశం కుట్ర అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆరోపించారు. ఈ ఘటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాలోకేష్ కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహ ధ్వంసానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత జాతి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి షేక్ ఆసిఫ్, నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన వెంకట మహేష్, బూదాల శ్రీనివాస్, వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలు, కోఆర్టినేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *