– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ సమైక్యతను చాటిచెప్పేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో హర్ ఘర్ తిరంగా- తిరంగా కాన్వాస్‌పై సంతకాలు చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సృజన.. డీఆర్‌వో వి.శ్రీనివాసరావు తదితరులతో కలిసి కాన్వాస్‌పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని.. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పతాకం ఔన్నత్యాన్ని, ప్రాధాన్యాన్ని చాటిచెప్పేందుకు, ప్రతిఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్లు డా. ఎ.మహేష్, కేవీ సత్యవతి; పౌర సరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా. కె.రమేష్, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.