– అంతర్జాతీయంగా ఇంగ్లీష్, జాతీయ భాషగా హిందీ , మాతృభాష తెలుగు పట్ల ప్రతి విద్యార్థి పట్టు సాధించాలి
– రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా తాను ఎంచుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బాలురు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. విద్యాపరంగా మీరు ఏ రంగంలో రాణించాలన్నా నాయకత్వ లక్షణాలను చాలా అవసరం, పదిమందితో మాట్లాడటం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించుకోవడం, సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవడం విద్యార్థి దశలో తప్పనిసరి అన్నారు. పేద విద్యార్థి విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ను ఉచితంగా అందిస్తుందన్నారు. విద్యార్థులు గైడ్స్ మీద ఆధారపడకుండా అధ్యాపకులు చెప్పిన ప్రతి అంశాన్ని పాఠ్యపుస్తకంలో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. రాజకీయాలే కాకుండా ఏ రంగంలో ముందుకు వెళ్లాలన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని ఆ దిశగా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలని సూచించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుందని భారతదేశ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నారని విద్యార్థులకు సూచించారు. విద్యావ్యవస్థలో సమూల్యమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంతర్జాతీయ సమాజంలో ఇంగ్లీష్ భాష చాలా అవసరమని ఆ దిశగా ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు జాతీయ భాష హిందీ, మాతృభాష తెలుగు పై ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో పట్టు సాధించాలని సూచించారు. మాతృభాషను మర్చిపోవద్దని, జాతీయ భాష నేర్చుకుందామని, అంతర్జాతీయ భాష ద్వారా ఎదుగుదామని విద్యార్థులకు సూచించారు. ఈ కళాశాల అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తూ ప్రత్యేక కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను చదివి నోట్స్ తయారు చేయటం వల్ల మరింత నాలెడ్జ్ పెరుగుతుందని తద్వారా పోటీ పరీక్షలలో విజేతలవుతారు అన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులైన మీరందరూ మీరు ఎంచుకున్న ఆయా రంగాల్లో అద్భుతంగా రాణించాలని మంత్రి విద్యార్థులకు పిలుపునిచ్చారు. నేడు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందించే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో పాఠశాల విద్య వరకు మాత్రమే పాఠ్య, నోట్ పుస్తకాలు పంపిణీ ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జూనియర్ కళాశాల వరకు ప్రభుత్వం విస్తరింప చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, భూపతి ఆదినారాయణ, డి వి ఈ ఓ, జె బి వి ఎస్ సుబ్రహ్మణ్యం, సమగ్ర సర్వ శిక్ష అభియాన్ డి ఈ, ఎస్. శ్రీనివాస్, ఎంఈఓ, కే ఎన్ వి. గురుమూర్తి, కాలేజీ ప్రిన్సిపల్, బి మేరీ సుజాత, నాయకులు రంగా రమేష్, బండి సత్యనారాయణ, నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు.