-ఏపీయూడబ్లూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో జనార్ధన్ పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు జర్నలిస్టులంతా ఐకమత్యంతో కృషి చేయాలని, జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల సాధనలో దేశంలోనే ఏపీయూడబ్ల్యూజే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ చెప్పారు. యూనియన్ 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ పతాకాన్ని అయన ఆవిష్కరించారు. అనంతరం నిర్మల హృదయ భవన్ లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశించి జనార్ధన్ మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఏపీయూడబ్ల్యూజేకి ఉందన్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఏపీయూడబ్ల్యూజే పేరిట జారీ కావడమే అందుకు నిదర్శనం అన్నారు. లెటర్ హెడ్ సంఘాలు అనేకం పుట్టుకొస్తున్నా ,12 వేల సభ్యత్వంతో దేశంలోని అతిపెద్ద యూనియన్ గా ఏపీయూడబ్లూజే విరాజిల్లుతుండడం వెనక నాయకత్వ పటిమ, నిబద్ధత కారణమని జనార్ధన్ అన్నారు. నాడు యూనియన్ వ్యవస్థాపకులు మనికొండ చలపతిరావు స్ఫూర్తితో పాత్రికేయుల సంక్షేమానికి మరింతగా ముందుకు సాగుతామని ఆయన ఉద్ఘాటించారు. విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచల జయరాజ్, విజయవాడ యూనిట్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ రమణా రెడ్డి ,నేషనల్ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ఎన్.సాంబశివరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి.రామారావు , సామ్న విజయవాడ అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు, యూనియన్ నేతలు.. టి.శివరామకృష్ణ, సి.శ్రీనివాస కుమార్, ఆకుల తిరుమలరావు,జి.రఘురాం, సురేష్,దారం నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.