నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును పరిశీలించిన సీఎం

-వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు
-సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కాదు…నిర్వహణకూ డబ్బులు ఖర్చు చేయలేదు
-రూ.5.40 కోట్లతో సోమశిల ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు
-రాష్ట్రంలో ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
-సర్వేరాళ్లపై బొమ్మలకు, రిషికొండ ప్యాలెస్ కు కోట్లు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం…కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది
-అనకాపల్లిలో విద్యార్థుల మృతికి కారణమైన సంస్థను మూసేస్తాం…కారకులపై చర్యలు తీసుకుంటాం
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆత్మకూరు/సోమశిల, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అలాంటి రాష్ట్రం గత ప్రభుత్వ తప్పుడు విధానాలు, నిర్లక్ష్య ధోరణి కారణంగా వ్యవసాయం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. రాష్ట్రంలో కరవు అనేది ఉండకూడదు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి యేటా రూ.20 వేల సాయం అందిస్తాం. సోమశిల ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేలా బాధ్యత తీసుకుని పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. నేను ఇక్కడికి రాకపోతే అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటారన్న ఉద్దేశ్యంతో వచ్చి పరిశీలించి ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చాను.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును ఆయన సోమవారం పరిశీలించారు. మ్యాప్ పాయింటింగ్ ద్వారా ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సోమశిల ప్రాజెక్టుకు మరమ్మతులు చేయిస్తాం
‘దెబ్బతిన్న సోమశిల గేట్లు రిపేరు చేయించి, ఆప్రాన్ నిర్మిస్తాం. స్లూయిస్ లో కూడా గోడ నిర్మిస్తాం. రూ.5.40 కోట్లతో గేట్లు మరమ్మతులు చేయిస్తాం. రాష్ట్రంలోని ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్క సోమశిలకే రూ.140 కోట్లు అవసరం అవుతుంది. గేట్లు కూడా సరిగా పని చేయడం లేదు. ఆస్తిని నిర్మించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు, మెయింటెనెన్స్, కాల్వల్లో పూడికలు చాలా ముఖ్యం. కానీ ఐదేళ్లుగా ప్రాజెక్టుల స్థితిగతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమశిల ప్రాజెక్టు చారిత్రాత్మకమైంది. 38 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 78 టీఎంసీలకు పెంచారంటే అది ఎన్టీఆర్ దూరదృష్టి వల్లే. సోమశిల ద్వారా 5.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 2018 ప్రాజెక్టుకు నీళ్లు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో పంటలు దెబ్బతింటాయని శ్రీశైలం నుండి 25 టీఎంసీలు తీసుకొచ్చి పంటలు కాపాడాం. రైతుల సమస్యలు అర్థం చేసుకునే పార్టీ టీడీపీ. కండలేరులో కూడా 68 టీఎంసీలు నిల్వచేసుకొని 3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో నీళ్లుంటే నెల్లూరు, కొంత తిరుపతి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీళ్లివ్వొచ్చు. ఈ యేడాది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా పడ్డాయి…మన రాష్ట్రంలో కూడా బాగా కురిశాయి. కృష్ణా నదిపై ఉన్న జలాశయాలన్నీ నీటితో కళ కళ లాడుతున్నాయి. పెన్నాకు కూడా వరద పెరిగితే కండలేరు, సోమశిల కూడా నిండుతాయి. భూమినే జలాశయంగా చేయగలిగితే నీటి సమస్యే ఉండదు. రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారు. మొత్తం రిజర్వాయర్లలో 983 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు… రాష్ట్రంలో ఇప్పటివరకు 692 టీఎంసీలు నిల్వ చేసుకున్నాం. 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఏపీలో ఆగస్టు నెలలో రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. రేడియం క్రస్ట్ గేట్లు, స్లూయిస్ లు దెబ్బతిన్నాయి…కొన్ని గేట్లు తుప్పుపట్టి పోయాయి.’’ అని సీఎం అన్నారు.

సర్వేరాళ్లపై బొమ్ములకు, రిషికొండ ప్యాలెస్ కు పెట్టిన ఖర్చులో సగం పెట్టినా ప్రాజెక్టులు పూర్తయ్యేవి
‘‘రైతాంగం మొత్తానికి నీళ్లు ఇచ్చే మార్గం చూస్తున్నా. పట్టిసీమను కూడా నాడు వ్యతిరేకించారు…అయినా నిర్మించి 100 టీఎంసీలు శ్రీశైలంలో నిల్వ చేశాం. నాగార్జున సాగర్ కుడి కాల్వకు గోదావరి నీళ్లు తెస్తే 160 టీఎంసీలు పొదుపు చేసుకోవచ్చు. వాటితో రాయలసీమలోని రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చు. నాగార్జున సాగర్ వద్ద నల్లమల అడవుల గుండా టన్నెల్ నిర్మించి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్తే వేల టీఎంసీల నీళ్లు గోదావరి నుండి సీమకు తెచ్చుకోవచ్చు. డబ్బులివ్వకపోతే కాంట్రాక్టర్ పనిచేస్తారా? ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని ప్రభుత్వం ఐదేళ్లు పాలించింది. ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వమిది. పాత రోజులు మరచిపోవాలని అందరికీ చెబుతున్నా. బాధ్యతగా పనిచేయాలి.. సకాలంలో పనులు పూర్తి చేయాలి. గత ప్రభుత్వంలో సర్వే రాళ్ల పై బొమ్మలకు రూ.700 కోట్లు ఖర్చుపెట్టారు. పేపర్లకు ప్రకటనల కోసం రూ.403 కోట్లు ఖర్చుపెట్టారు. రిషికొండ కొట్టేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టించుకున్నారు. ఈ డబ్బుల్లో రూ.200 కోట్లు ఖర్చుపెట్టినా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. తుంగభద్రలో గేటు కొట్టుకుపోతే వెంటనే ఇంజనీర్ ను పంపాం. కర్ణాటకకు మన మంత్రులు వెళ్లి మాట్లాడారు. మన వద్ద ఉన్న ఇంజినీర్ కన్నయ్యనాయుడును పంపాం. మూడు, నాలుగు రోజుల్లోనే గేటు పెట్టి నీటిని నిల్వచేయగలిగాం…వారికి అభినందనలు తెలుపుతున్నా.’ అని అన్నారు.

తప్పు చేసిన వారు ఎక్కడ దాక్కున్నా వదలను
‘నేను సీఎంగా బాధ్యతలు చేపట్టగానే 5 హామీల అమలుపై సంతకాలు పెట్టాను. చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వాలనే ఉద్దేశ్యంతో మెగా డీఎస్సీలో భాగంగా 16,347 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నాం. రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పై చేశాం. మీ భూములకు కూడా టెండర్ పెట్టడానికి గత పాలకులు ఈ చట్టాన్ని తెచ్చారు. మదనపల్లిలో ఫైళ్లు తగలబెట్టారు. షార్ట్ షర్క్యూట్ అని ప్రచారం చేశారు. ఇది షార్ట్ సర్య్కూటా…లేక వివేకానందరెడ్డిలాగా గొడ్డలిపోటా అన్న అనుమానం వచ్చింది. కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో తప్పులు చేసి మాట్లాడుతున్నారు. గుడ్డ కాల్చి ముఖాన వేసి తుడుచుకోమని చెప్తున్నారు. వివేకాను చంపి నారాసుర రక్త చరిత్ర అని మళ్లీ నాపైనే కథనాలు రాశారు. అందుకే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధంపై డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను పంపి అక్కడికి విచారణకు ఆదేశించాను. అసైన్డ్ భూములను 22ఏ నుండి ఫ్రీహోల్డ్ చేసి భూములు దోచేశారు. ఇళ్లలో కూర్చుని నచ్చినట్లు ఫైళ్లు రాశారు. నిన్న పోలవరం ఫైల్స్, అంతకముందు పొల్యూషనో బోర్డు ఫైల్స్ కాల్చేశారు. ఫైల్స్ తగలబెట్టి మళ్లీ ఏమీ తెలియనట్లుగా ఎదురు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వంలో రాజకీయ కక్షలు ఉండవు…కానీ తప్పులు చేసిన వారు ఎక్కడ దాక్కున్నా వదలము.

ఇసుక ర్యాంపులు పరిశీలిస్తా
‘ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని చెప్పిన మాట ప్రకారం అమలు చేశాం. నాకు ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదుర్కొంటా. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలను కోరుతున్నా…మనకు మంచి పేరు రావాలంటే కలిసి పని చేయాలి. ఉచిత ఇసుక చివరి లబ్ధిదారు వరకు చేరాలి. సీనరేజ్, రవాణా, తవ్వకం ఖర్చు తప్ప ఇసుకకు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు ఇసుక ర్యాంపులను నేను కూడా సందర్శిస్తా. పేదలకు రూ.5లకే అన్నక్యాంటీన్ ద్వారా అన్నం పెడుతుంటే సహించలేకపోతున్నారు. ఇటీవల 100 క్యాంటీన్లు ప్రారంభించాం…త్వరలో అన్నింటినీ ప్రారంభిస్తాం. మద్యంలో కూడా సొంత బ్రాండ్లతో గత పాలకులు ప్రజల ప్రాణాలు తీశారు. మద్యం దోపిడీపైనా విచారణ చేయిస్తున్నాం. 7 ప్రధానాంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవాలను ప్రజలకు వివరించాం.’ అని పేర్కొన్నారు.

అనకాపల్లిలో విద్యార్థుల మృతికి కారణమైన సంస్థను మూసేస్తాం…కారకులపై చర్యలు తీసుకుంటాం
‘అనకాపల్లి జిల్లాలో అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తినడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మంచి కార్యక్రమం చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. తప్పులు చేయడానికి అవకాశం ఉండకూదు. ఆ ఆశ్రమాన్ని మూసేసి పిల్లలను ప్రభుత్వమే చదివించేలా చర్యలు తీసుకుంటుంది. నిర్వాహకులను విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకొనేవరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. తప్పు చేసిన వారు ఎంతగొప్పవారైనా శిక్షిస్తేనే అందరిలో భయం ఉంటుంది.’ అని సీఎం అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *