-డిసెంబరుకల్లా వైజాగ్ ల్యాబ్‌ను అందుబాటులోకి తేవాలి
-ఫుడ్ సేఫ్టీ కమీషనర్ సి.హరికిరణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఐపిఎంలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని త్వరలో భర్తీ చేసి దీన్ని గాడిలో పెడతామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు ఫుడ్ సేఫ్టీ కమీషనర్ సి.హరికిరణ్ అన్నారు. కొత్తగా ఆహార వ్యాపారాల కోసం రిజిస్టర్ చేసుకునే వారికి వీలైనంత త్వరగా లైసెన్స్‌లు ఇవ్వగలిగితే తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సూచించారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఇన్సిట్యిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పనితీరును ఆయన సమీక్షించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను నెలకొల్పేందుకు అవసరమైన ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలన్నారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా విశాఖపట్నంలోని రాష్ట్రస్థాయి ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే తిరుపతి, గుంటూరు రాష్ట్రస్థాయి ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సంచార టెస్టింగ్ వాహనాల పనితీరుపై ఆరా తీశారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వీటిని వినియోగించాలన్నారు. ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. తక్షణం అవసరమైన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నెలకు ఎన్ని టెస్టులు చెయ్యాలో టార్గెట్ ఏమైనా ఇచ్చారా అని ఐపిఎం ఇన్ఛార్జ్ జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావును ప్రశ్నించారు. ఎఫ్ఎస్ఎస్ఎఐ మార్గదర్శకాల మేరకు నీటి, ఆహార శాంపిళ్లను పరీక్షిస్తున్నామని ఆయన కమీషనర్‌కు వివరించారు. అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వరి, ఇతర సిబ్బంది సమీక్షలో పాల్గొన్నారు.