-ఈ నెల 23న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం, ఈనెల 23 నుండి జరిగే గ్రామ సభలపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత కమిషనర్లు, కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి సంబంధిత అధికారులతో హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఈ నెల ఆగస్ట్ 23 న జిల్లాలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామ అభివృద్ది సంబంధిత పలు అంశాల ఆమోదం పొందాలని సూచించారు. ఇందులో ప్రతి గృహానికి కనీస అవసరాలు, గ్రామ అవసరాలు, రోడ్ కనెక్టివిటీ, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నరేగా అంశాలపై చర్చించాలని, దీని ద్వారా గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు అవుతుందని తెలిపారు. మొదటగా ప్రతి ఇంటికి కనీస వసతులైన రక్షిత మంచినీటి కొళాయి కనెక్షన్, ఎల్ పి జి గ్యాస్, కరెంట్ కనెక్షన్, మరుగుదొడ్లు ఉండేలా, రెండవ అంశం గ్రామానికి సంబంధించి డ్రైనేజీ, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు , సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు ఉండేలా మూడవ అంశం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతర్గత రోడ్లు, ఆసుపత్రి, పాటశాల ఏర్పాటు,గ్రామాలకు కనెక్టివిటీ, ఫారం పాండ్లు నాలుగవ అంశంగా కుటుంబ ఆదాయ పెంపుదల కార్యక్రమాలు అయిన పశువులకు షెడ్, పశు సంపద, గొర్రెల పెంపకం,ఉద్యాన వన, సెరికల్చర్ పంటల సాగు వంటివి ప్రోత్సహించడం ఐదవ అంశంగా నరేగా కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి పనులను గుర్తించి చేపట్టనున్న వేజ్ ఎంప్లాయిమెంట్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వంటి అంశాలు గ్రామ సభలో చర్చించి తీర్మానం చేయాలి. ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా మార్చేందుకు ప్రతిపాదనలు గ్రామ సభలో చర్చించి ప్రణాలికలు ఆమోదించాలనీ, తదనుగుణంగా సదరు ఫోటోలు, గ్రామ సభల రిజల్యూషన్లను సంబంధిత వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. గ్రామ సభల నిర్వహణకు ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉచిత ఇసుక విధానం అమలు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పిడి డ్వామా శ్రీనివాస ప్రసాద్, సిఈఓ జిల్లా పరిషత్ గ్లోరీ డిప్యూటీ సిఈఓ ఆది శేషారెడ్డి, జిల్లా పంచాయితీ అధికారిణి సుశీల దేవి తదితర అధికారులు పాల్గొన్నారు.