-సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి
-ఘనంగా నిర్వహించిన ‘నేషనల్ స్పేస్ డే’ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ్ఞాన ప్రయోగాల విషయంలో అన్ని దేశాల కంటే భారతదేశాన్ని ముందు ఉంచాలని సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రాచీన కాలంలో ఖగోళశాస్త్రంపై ఆర్యభట్ట, భాస్కరాచార్య వంటి ఎందరో మహానీయులు ప్రయోగాలు చేశారని, ఆధునిక కాలంలో డా ఏపీజే అబ్దుల్ కలాం, విక్రం సారాభాయ్, కల్పనా చావ్లా వంటి వారిని ఆదర్శంగా తీసుకొని భావితర శాస్త్రవేత్తలగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రాచీన భారతదేశంలో వేదాల్లో, పురాణాల్లో సైన్స్ గురించి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.
పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ నగరశివారు ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ ఖగోళ దినోత్సవం (నేషనల్ స్పేస్ డే) సందర్భంగా ‘అంతరిక్షయానంలో భారతదేశ పురోగతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్టెమ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ల ద్వారా సైన్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. విద్యార్ధులు పాఠశాలల్లోని ప్రయోగశాలలను సద్వినియోగపరచుకోవాలన్నారు. వాతావారణ మార్పులకు అనుగుణంగా జీవనవిధానాలను మార్చుకోవాలని, మానవాళి పర్యావరణ కాలుష్యం నుండి రక్షించడానికి కొత్త ఆవిష్కరణలు సృష్టించాలన్నారు.
అనంతరం బెల్ మాజీ జనరల్ మేనేజర్ డాక్టర్ డీకేఆర్కే వరప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏ అంశాన్నయినా ఇంటర్నెట్ లో తెలుసుకునే అవకాశం ఉంది. నేటితరం స్పేస్ కు సంబంధించిన అంశాలపై మరింత అవగాహనపరచుకోవాలని అన్నారు. విద్యార్థులకు అంకితం భావంతో బోధిస్తే ఉపాధ్యాయులు వారి మనసులో ముద్ర పడిపోతారని అన్నారు.
ఆత్మీయ అతిథిగా హాజరైన కృష్ణా జిల్లా డీఈవో తాహేరా సుల్తానా గారు మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి అంశం సైన్స్ తో ముడిపడి ఉందని అన్నారు. గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి. రోజూ సైన్స్ పాఠం పై మక్కువ చూపితే ఆకాశమే హద్దుగా సాగి భావితర శాస్త్రవేత్తలుగా తయారు కావాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ధనేకుల ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కడియాల రవి, సమగ్ర శిక్ష డిప్యూటి డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, లెక్చరర్ డా. రావి అరుణ, గుడివాడ డీవైఈవో పద్మారాణి, డైట్ విశ్రాంత ప్రిన్సిపాల్ జివిఆర్ ఆంజనేయులు, దీక్షా సమన్వయకర్త డా. టి.ఇస్మాయిల్, డైట్ లెక్చర్ లలిత మోహన్, నెల్లూరు సైన్స్ సెంటర్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం, ఐఈ కో ఆర్డినేటర్ పి.వనజ, ఎంఈవోలు ధనలక్ష్మి, బి. సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.