-శ్రీకృష్ణ నామస్మరణతో మారుమ్రోగిన వైష్టవాలయాలు
-కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు సోమవారం వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్టవాలయాలను దర్శించి స్వామి వారికి అభిషేకాలు, పంచామృతాలు, గీతా పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడను స్వామివారికి నైవేధ్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నికృష్ణులు, గోపికల వేషధారణ ఆకట్టుకున్నాయి. మధురానగర్ వి.వి.నరసరాజురోడ్డులోని శ్రీకృష్ణుని ఆలయంలో జరిగిన వేడుకలలో వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భగవద్గీత ప్రబోధకుడిగా, రాజనీతిజ్ఞుడిగా కృష్ణుడి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు శ్రీకృష్ణతత్వం ప్రతీక అన్నారు. భారతీయ హిందూ ఆధ్యాత్మిక, సామాజిక జీవన విధానంలో శ్రీ కృష్ణుని తాత్వికత అత్యంత ప్రత్యేకమైనదని.. ప్రభావశీలమైనదని తెలిపారు. మానవ సామాన్య మస్తిష్కం అర్థం చేసుకోలేని అనేక సందేహాలకు కృష్ణతత్వంలో సమాధానాలున్నాయన్నారు. కష్ట సుఖాలు, మంచి చెడులు, లాభనష్టాలకు అతీతంగా అన్ని సందర్భాల్లోనూ.. ఒకే విధమైన ప్రవర్తనను కలిగివుండే స్థితప్రజ్జతను సాధించడం శ్రీ కృష్ణతత్వంలోని పరమార్థమని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.