-ప్రాజెక్టును ప్రారంభించిన శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘వ్యర్థాలను సక్రమ పద్ధతిలో వినియోగించగలిగితే గ్రామాల పరిశుభ్రతతో పాటు పంచాయతీలకు సిరుల పంట పండించవచ్చ’ని జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం పిఠాపురం నియోజకవర్గం ఫకృద్దీన్ పాలెంలో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్తను సేకరించేందుకు వీలుగా ఇంటింటికి బకెట్లను పంపిణి చేశారు. అనంతరం చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ “రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ వ్యవస్థ ను పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు ఫకృద్దీన్ పాలెంలో పనులు ప్రారంభించాం. ఇక్కడ వచ్చిన ఫలితాలను బట్టి మిగిలిన ప్రాంతాల్లో అమలు చేస్తాం. సాలిడ్ అండ్ లిక్విడ్ మేనేజ్మెంట్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు ఈ ప్రాజెక్టు చాలా అవసరం. గ్రామాల్లో పక్కగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జరపవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో దీని వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్గానిక్ వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి, వర్మీ కంపోస్ట్ ల నిర్వహణ ద్వారా పంటలకు ఎరువులు తయారు చేయవచ్చు” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎల్.ఆర్.ఎం. ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.శ్రీనివాసన్, నియోజకవర్గ ఇంఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.