-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ భానుమూర్తి రాజు
-దేశంలోనే మొట్ట మొదటిసారిగా జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్కూళ్లకు అవార్డులు అందజేత
-రాష్ట్రస్థాయిలో నున్నహైస్కూల్‌కు రెండోస్థానం, ఎన్‌టీఆర్ జిల్లాస్థాయిలో ప్రథమస్థానం
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ఎవరికైనా క్రీడలలో రాణించటం ద్వారానే మంచి గుర్తింపు లభిస్తుందని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఐపీఈ), స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎప్ఐ) రాష్ట్ర కార్యదర్శి జీ భానుమూర్తి రాజు అన్నారు. ఒక క్రీడాకారుడి గెలుపు అతని కుటుంబానికే కాకుండా, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో దోహదపడుతుందన్నారు. క్రీడాకారులను, వారికి పాఠశాలల్లో శిక్షణ ఇచ్చే వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రత్సహించేందుకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా క్రీడలలో ఉత్తమంగా రాణిస్తున్న పాఠశాలలకు స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రానికి ముందే దేశానికి ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలను అదించిన హాకీ క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున జిల్లా, రాష్ట్రస్థాయిలలో రాణించే పాఠశాలలకు క్రీడా ప్రతిభా అవార్డుల పేరుతో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం చేస్తున్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలు, రాష్ట్రంలోనే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ లో రెండోస్థానం సాధించిన నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అవార్డుల ప్రదానోత్సవం విజయవాడలోని ఎన్‌టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గురువారం జరిగింది. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి (డీఎస్ఈఓ) యూవీ సుబ్బారావుతో కలసి ఎస్‌జీఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, ఐపీఈ భానుమూర్తి రాజు అవార్డులను అందజేశారు. తొలుత అతిధులు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భానుమూర్తి రాజు మాట్లాడుతూ, ఎన్‌టీఆర్ జిల్లాలో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డును కైవసం చేసుకున్న నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1,008 పాయింట్లతో రాష్ట్రంలో రెండోస్థానం సాధించడం విశేషమన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, దాతల సహకారంతో ఆ పాఠశాల ఈ విజయాన్ని అందుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో జిల్లాలోని ఇతర పాఠశాలలు పని చేసి వచ్చే ఏడాది అవార్డుల కోసం పోటీ పడాలన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు పాఠశాలల్లోనే తయారవుతారని, అక్కడ నుంచే వారికి లక్ష్యాలను నిర్దేశించాలని సూచించారు. దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్‌లో దేశానికి కేవలం ఆరు పతకాలు రావడం బాధాకరమని, అందుకే క్రీడలను మరింతగా ప్రోత్సహించే రానున్న రోజులలో దేశానికి మరిన్ని పతకాలు అందించే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలని కోరారు. డీఎస్ఈఓ సుబ్బారవు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు చెందిన నున్న హైస్కూల్ రెండోస్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నున్నను ఆదర్శంగా తీసుకుని ఇతర పాఠశాలలు క్రీడలలో రాణించేందుకు పోటీ పడాలన్నారు. వచ్చే ఏడాది నుంచి క్రీడా దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. అనంతరం ఎన్‌టీఆర్ జిల్లాస్థాయిలో ప్రథమ, రాష్ట్రస్థాయిలో రెండోస్థానం సాధించిన నున్న హైస్కూల్ హెచ్ఎం వజ్రాల భూపాల్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు టి విజయ వర్మ, టి శ్రీలతను దుశ్శాలువాలతో సత్కరించి, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందజేశారు. అలాగే జిల్లాలో రెండోస్థానం సాధించిన పటమట బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, మూడోస్థానం సాధించిన ఎస్‌టీవీఆర్ వీఎంసీ స్కూల్‌నకు, నాలుగో స్థానం సాధించిన ఎస్ కే పీ వీవీ హిందూ హైస్కూల్‌కు, ఐదో స్థానం సాధించిన నిడమానూరు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డెరెక్టర్ కేవీఎన్ కుమార్ తదితరులు పాల్లొన్నారు.