-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ కామర్స్ లో చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. నేతన్నలకు 365 రోజులూ పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు గురువారం కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, గడిచిన అయిదేళ్లలో చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. 2014-19లో తమ ప్రభుత్వం నేతన్నల అభ్యున్నతికి అమలు చేసిన అన్ని పథకాలనూ గత జగన్ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. దీనివల్ల చేనేతకు ప్రోత్సాహం కరవై…నేతన్నలపై మోయలేని భారం పడిందన్నారు. అదే సమయంలో ఉత్పత్తయిన వస్త్రాలకు మార్కెట్ సదుపాయం లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి తిరిగి రాక, నేతన్నలు అప్పుల పాలయ్యారన్నారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావడంతో, చేనేతకు మంచి రోజులు వచ్చాయన్నారు. 2014-19లో అమలు చేసిన అన్ని పథకాలనూ మళ్లీ అమలు చేస్తామన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని మినహాయించే అంశపై త్వరలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏడాదిలో 365 రోజులూ పని కల్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ కామర్స్ లో చేనేత వస్త్రాల విక్రయాలకు ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారన్నారు. విజయవాడలో నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శన పెద్ద ఎత్తున విజయం సాధించిందన్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి ప్రదర్శనలు రాష్ట్ర మంతటా నిర్వహించి, చేనేత ఉత్పత్తుల విక్రయాలకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి సవితకు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు పీఎం త్రినాథ్, టి.మోహన్ కృష్ణ, బి.ఆనందప్రసాద్ కె.కోటేశ్వరరావు, వి.పల్లపురాజు, ఫణికుమార్, పరమేశ్వరరావు, శేషయ్య నేత, దుర్గాప్రసాద్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.