-ఖజానాకు భారమైనా లబ్దిదారుల కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పూర్తికి సీఎం అంగీకారం
-ల్యాండ్ పూలింగ్ కు తాజాగా భూములిస్తున్న వారికి సొంత గ్రామాల్లో ప్లాట్లు కేటాయించేలా కసరత్తు
-వచ్చే నెల 15 వ తేదీ లోపు రైతులకు ఒక విడత కౌలు నిధులు జమ
-విజయవాడ,విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ లపై కేంద్రానికి నివేదికలు
-జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం
-37 వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి నారాయణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు ప్రాధాన్యత ప్రకారం వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ..ఇంకా 3వేల 550 ఎకరాలు భూసమీకరణ ద్వారా రైతుల నుంచి సేకరించాల్సి ఉందన్నారు.గతంలో భూములు ఇవ్వని వారు తాజాగా సీఆర్డీఏ కు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు.గత నెల రోజులుగా 120 ఎకరాలు భూమిని రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీఏకు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు..గతంలో ల్యాండ్ పూలింగ్ కు భూములిచ్చిన వారికి లాటరీ విధానంలో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేవారు..తాజాగా భూములిచ్చిన వారికి ప్రస్తుతం సీఆర్డీఏ వద్ద ఉన్న భూముల్లో ప్రాధాన్యత ప్రకారం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు…సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 37 వ సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు..ముఖ్యంగా మూడు అంశాలపై అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు..వీటిలో ఒకటి ల్యాండ్ పూలింగ్ రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు అంశం..
ఇక రెండో అంశంగా రాజధానిలో నిర్మాణంలో ఉన్న సీఆర్డీఏ భవనంపై చర్చించారు..రాయపూడి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకుని సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది…ఈ భవనం నిర్మాణానికి 160 కోట్లు కేటాయిస్తూ అధారిటీ నిర్నయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 విధానంలో భవనం నిర్మిస్తున్నారు..ఈ భవనం నిర్మాణం పూర్తయితే సీఆర్డీఏ,ఏడీసీతో పాటు మొత్తం మున్సిపల్ శాఖకు చెందిన అన్ని విభాగాలు ఇక్కడి నుంచే పనిచేస్తాయన్నారు…దీనివల్ల పాలన సులభం అవుతుందని చెప్పారు మంత్రి..ఈ భవనం నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు.సీడ్ క్యాపిటల్ లో మొత్తం 14.46 ఎకరాల్లో జీ ప్లస్ 18 అంతస్తులు ఉండేలా మొత్తం 12 టవర్లను నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్నయించింది…దానికి తగ్గట్లుగా ఆన్ లైన్ లో బుకింగ్ ప్రారంభించగానే కేవలం గంటలోనే అన్ని ఫ్లాట్లు బుక్ అయిపోయాయని…714 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టగా గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేసిందన్నారు..దీంతో ఫ్లాట్లు బుక్ చేసిన వారు నష్టపోకుండా ఈ ప్రాజెక్ట్ ను తిరిగి చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు..అయితే గత ఐదేళ్లుగా ప్రాజెక్ట్ చేపట్టకపోవడంతో 713 కోట్లతో పూర్తికావలసిన ప్రాజెక్ట్ విలువ 930 కోట్లకు పెరిగిపోయింది..అయినా సరే ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు…
రాజధాని రైతులకు వచ్చే నెల 15 వ తేదీ లోగా కౌలు నిధులు విడుదల
రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం కౌలు చెల్లించలేదని మంత్రి నారాయణ ఆరోపించారు.గత ఏడాది కౌలు నిధులు 175 కోట్లు,ఈ ఆర్ధిక సంవత్సరంలో 225 కోట్లు బకాయి ఉందన్నారు…అయితే గత ఏడాది ఇవ్వాల్సిన 175 కోట్ల నిధులను వచ్చే నెల 15 లోగా రైతుల ఖాతాల జమ చేసేలా సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారన్నారు..ప్రస్తుతం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని..ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలు నిధులు కొంత గ్యాప్ తర్వాత చెల్లిస్తామన్నారు.పెన్షన్లకు నిధులు భారీగా వెచ్చిస్తుండటంతో ప్రభుత్వానికి కొద్దిగా ఆదాయం వచ్చిన తర్వాత పెండింగ్ కౌలు నిధులు చెల్లిస్తామని రైతు సోదరులకు స్పష్టం చేసారు మంత్రి.
విజయవాడ,విశాఖపట్నంలో మెట్రో రైలుకు మళ్లీ కదలిక
సీఎం చంద్రబాబు వద్ద జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో విజయవాడ,విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ లపై చర్చ జరిగింది.రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం విజయవాడ,విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ లు చట్టంలో పేర్కొన్నారన్నారు…దానికి తగ్గట్లుగానే మెట్రో ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.విజయవాడలో రెండు దశల్లో మెట్రో ప్రాజెక్ట్ చేపట్టేలా డీపీఆర్ సిద్దం చేసారు.మొదటి దశలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకూ 25.95 కిమీ,అలాగే బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ 12.45 కిమీ నిర్మాణం చేపట్టనున్నారు..మొత్తం మొదటి దశలో 38.40 కిమీ మేర నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం 11 వేల 9 కోట్లు ఖర్చవుతుంది..ఇక రెండో విడతలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి రాజధానికి మొత్తం 27.80 కిమీ మేర మెట్రో నిర్మాణం చేసేలా డీపీఆర్ రూపకల్పన చేసారు…దీనికి 14 వేల 121 కోట్లు ఖర్చవుతుందని అంచనా..అంటే విజయవాడ మెట్రోకు మొత్తం రెండు దశలకు కలిపి 66.20 కిమీ మేర నిర్మించే ప్రాజెక్ట్ కు 25 వేల 130 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ చెప్పారు.
ఇక విశాఖ పట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్లలో రెండు దశల్లో మెట్రో నిర్మాణానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్దం అయింది..మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకూ 34.40 కిమీల మేర మొదటి కారిడార్,గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకూ మొత్తం 5.07 కిమీ మేర రెండో కారిడార్,తాడిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.75 కిమీ మేర మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు..అంటే మొదటి దశలో మొత్తం 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో మెట్రో చేపట్టనున్నారు..ఇక రెండో దశలో కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ 30.67 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు..అంటే విశాఖలో మొత్తం 76.90 కిమీ మేర మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి దశలో 11 వేల 4987 కోట్లు,రెండో దశలో 5,734 కోట్లు కలిపి మొత్తం 17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
ఈ రెండు ప్రాజెక్ట్ ల ఫేజ్ వన్ కు సంబంధించిన అంచనాలను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.అయితే మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్రం వద్ద నాలుగు రకాల ప్రతిపాదనలు ఉన్నాయన్నారు…విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం మొత్తం కేంద్రమే భరించాలని పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు..విజయవాడకు ఇప్పటికిప్పుడు మెట్రో రైలు అవసరం లేకపోయినా రాబోయే పదేళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని కీలకమైన మెట్రో ప్రాజెక్ట్ లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు…ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రపంచం మొత్తం మెట్రో రైలు పై ఆధారపడిందని…పెరిగే జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో అవసరం ఉంటుందని అన్నారు.
జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు
అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం అధ్యయనం జరుగుతుందన్నారు మంత్రి పొంగూరు నారాయణ.త్వరలో అన్ని పనులకు టెండర్లు పిలిచి జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించేలా ముందుకెళ్లున్నట్లు స్పష్టం చేసారు.
శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.