Breaking News

హరితాంధ్రప్రదేశ్ కోసం అడుగేద్దాం….పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృష్టి చేద్దాం

-రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం వస్తే అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్
-మొక్క లేకపోతే మానవ మనుగడే లేదు…చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు
-175 నియోజకవర్గాల్లో నగర వనాల ఏర్పాటు…నీటి వనరులు, సహజ వనరుల పరిరక్షణ
-ప్రకృతి ప్రజల ఆస్తి….దాన్ని అందరం కాపాడుకోవాలి
-ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలు అయినా నాటాలి…చెట్లను పెంచాలి
-ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరిక… అడవిలో కాలు పెడితే సంగతి తేలుస్తాం
-పచ్చదనం, చల్లదనం కోరుకుంటూ…మొక్కలు పెంచకపోతే ఎలా?
-వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“హరితాంద్ర కోసం అడుగేద్దాం.. ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం” అన్న సమున్నత లక్ష్యంతో భవిష్యత్ లో రాష్ట్రంలో 50 శాతం విస్తీర్ణం గ్రీన్ కవర్ వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని వనమహోత్సవం-2024 సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనమహోత్సవంలో పాల్గొన్న చిన్నారుల చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేయించారు. చిన్నారుల భవిష్యత్తే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఈ నేపథ్యంలోనే వన మహోత్సవ ప్రతిజ్ఞ చిన్నారుల చేత చేయించడం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. అందరం హరిత యజ్ఞంలో పాలుపంచుకుందాం.. ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో సింగారిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఇక నుంచి ఎక్కువ మొక్కలు నాటిన వారిని గుర్తించి అలాంటి వారికి ఆగస్టు 15, జనవరి 26 న అవార్డులు అందించి ప్రోత్సహిస్తామని సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పర్యావరణం మక్కువ ఎక్కువన్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చెట్లు నాటాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మరి నేడు రాష్ట్రం మొత్తం బాధ్యత తీసుకున్నాడు. అందరం ఆక్సీజన్ తీసుకుంటాం, కానీ ఆక్సిజన్ ఇచ్చే చెట్టును మాత్రం పెంచాలని ఆలోచించమన్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి లేదా రెండు చెట్లు నాటితే దాదాపు 10కోట్ల చెట్లు అవుతాయని తెలిపారు. ఈ ఏడాది లక్ష్యం ఒక కోటి చెట్ల నాటడమని, కోటి మొక్కలు నాటితే 0.33 శాతం గ్రీన్ కవర్ పెరుగుతుందని స్పష్టం చేశారు. ఇది ఒక ఉద్యమంలా తీసుకోవాలని తెలిపారు. తొలిసారిగా 1950లో నాడు కేంద్రమంత్రిగా ఉన్న వ్యక్తి వన మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. అప్పటి నుండి మనందరం పాటిస్తున్నామన్నారు. తాను 30,40 సంవత్సరాల నుండి రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మొక్కల పెంపకం కార్యక్రమానికి పెద్దపీట వేశానని గుర్తుచేశారు. తన మనస్సుకు దగ్గరుండే కార్యక్రమం వన మహోత్సవం అన్నారు. ఒకప్పుడు పాఠశాలల్లో గార్డెనింగ్ ఉండేది. కానీ నేడు అసలు గార్డెనింగ్ అన్నదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు . తమ చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లి దగ్గరలోని బావుల్లోని నీరు తెచ్చి మొక్కలకు పోసేవాళ్లమని తెలిపారు. ఈ సందర్భంగా మీరు ఎంత మంది మొక్కలకు నీళ్లు పోస్తున్నారని చిన్నారును నేరుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం వస్తే అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఉద్ఘాటించారు. ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాము. అప్పట్లో అదోక విప్లవం. ఆ తరువాత ఇంకుడు గుంతలను ప్రోత్సహించాం. అప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. పడే ప్రతి వర్షపు చినుకును భూగర్భజలాలుగా మార్చాలి. భూమినే జలశయంలా మార్చినప్పుడు ఇబ్బందులనేవి ఉండవన్నారు. గతంలో అడవులు చుట్టూ కందకాలు తవ్వించాము. అక్కడ పడిన వర్షపు నీరు కందకాల్లోకి చేరుతుంది.కందకాల మధ్యలో చెక్ డ్యాంలు కట్టడం జరిగింది. దీంతో నీరు ఎక్కడికక్కడ నిలిచి భూగర్భంలోకి వెళ్లి చుట్టూ ప్రక్కల భూగర్భజలాలు పెరుగుతాయి. అంతటి మంచి కార్యక్రమాలు నాడు చేశామని గుర్తుచేశారు. మంగళగిరి ఎకో పార్క్, ఎయిమ్స్, బెటాలియన్ ఇవన్నీ అమరావతి రాజధాని నడిబొడ్డున ఉండటం గర్వకారణమన్నారు. ఎకో పార్కును చూస్తుంటే ఎటు చూసినా పచ్చదనం అలుముకుని సుందరంగా ఉంది, కళ్లకు ఇంపుగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. మనస్సు ఆహ్లాదంగా ఉందన్నారు. ప్రతి రోజూ ఉదయం పార్క్ లో 300 మంది వాకింగ్ చేస్తున్నారు. వారి సంఖ్య 3వేలు కావాలన్నారు.

అమరావతి ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో హైదరాబాద్ లో గుట్టలు, కొండలు అలాంటి సమయంలో చెట్లు పెంచాం, రోజుకు లక్ష నుంచి 5 లక్షల వరకు మొక్కలు నాటాం. దీంతో నేడు ప్రపంచంలోనే హైదరాబాద్ గ్రీన్ సిటీగా గుర్తింపు పొందిందని వివరించారు. 2014లో మిషన్ హరితాంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం. అప్పుడు 50 శాతం గ్రీన్ కవర్ రావాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ రావాలంటే 26 జిల్లాల్లోనూ మొక్కలు పెంచే కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి. అందుకనే డ్రోన్ ల ద్వారా విత్తనాల బంతులను చల్లి మొక్కలు పెరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లు పెంచే కార్యక్రమానికి మనందరం శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నగర వనాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అక్కడ జపనీస్ టెక్నాలజీ మియావకీ అనే కార్యక్రమం ద్వారా ఒక హెక్టార్ లో మొక్కలు నాటి ఆదర్శంగా తీర్చిదిద్ది, ఆసక్తి ఉన్న వాళ్ల ద్వారా ఉద్యమంలా ముందుకు తీసుకువెళతామన్నారు. నరేగా నిధులను మియావకి కలపడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్న ఉప ముఖ్యమంత్రి సూచన చాలా బాగుందని ప్రశంసించారు. నేడు నదులు, వాతావరణం ఒకటేమిటి అన్ని విధాల కాలుష్యం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క అడవులను నరికి వేస్తున్నాం. మరికొంత మంది కాలువలను, చెరువులను కబ్జా చేస్తున్నారు. పట్టణాలు పెరిగిపోతుండటంతో కాంక్రిట్ మయమైపోతుంది. దీంతో పర్యావరణం పరంగా పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. దీనివలన కరువు, కాటకాలు, భారీ తుఫాన్ లు వస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అంటే ఒకే ప్రాంతంలో కుండపోత వర్షం కురవడం జరుగుతుంది. ఇదే కేరళలో కూడా జరిగింది. ఇవన్నీ తప్పించుకోవాలంటే మొక్కలు నాటడమే పరిష్కారమని సూచించారు.

ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. అమరావతిని సుందర రాజధానిగా తీర్చిదిద్దుతాం. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నాము. రాజధాని ప్రాంతంలో 51 శాతం చెట్లు ఉంటాయి. పార్క్ లు ఉంటాయి. గత ప్రభుత్వం మాత్రం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తులను ప్రోత్సహించి వారికి సీట్లు కూడా ఇచ్చే పరిస్థతికి వచ్చారు. ఇక సహజ వనరుల దోపిడి చూస్తే రూ. 19వేల కోట్లు దోపిడికి పాల్పడ్డారు. ఇసుక సంగతికి వస్తే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. నీళ్లు, గాలి, సకాలంలో వర్షాలు, భూగర్భంలో సహజ వనరులు ప్రకృతి ఇస్తే వాటిని కూడా దోచుకుని చివరకు కొండలను సైతం తవ్విపడేశారు. రుషికొండ ను తవ్వి రూ. 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. నాటి పాలకుల ఆలోచన విధానం ఇలా ఉంది. గత పాలకులు ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడ చెట్లు మొత్తం కొట్టేయించేవారు. కానీ మేము మొక్కలు నాటుతాం కాని చెట్లను నరకము. ఎవరినీ నరకనీయం. ఇది మా సిద్దాంతం. బ్రహ్మంగారు కాలజ్ఞనం రాసిన రవ్వలకొండను సైతం గత పాలకులు తవ్విపడేశారు. అంతటి దుర్మార్గమైన పాలన చేశారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారు. కొలంబియాలో ప్లాబ్లో ఎస్కోబార్ అనే నాయకుడు డ్రగ్స్ వ్యాపారం చేసి వందలు వేల కోట్లు సంపాదించి, ఆ సొమ్ముతో రౌడీజం చేసి, ప్రజలను భయబ్రాంతులను చేసిన సంఘటన గుర్తుకువస్తుంది. ఎస్కోబార్ లాగే గత పాలకుడు ఉన్నాడు. స్వేచ్ఛగా బ్రతకలేని పరిస్థతి రాష్ట్రంలో సృష్టించారు. రౌడీ పాలన దెబ్బకు ప్రజలు భయపడిపోయేవారు. ఇప్పుడు మనకు స్వేచ్ఛ వచ్చింది. అలాంటి వారు మళ్లీ వస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుంది. భవిష్యత్ అంధకారమవుతుంది. వ్యవస్థలు ఎంతలా నాశనం అయిపోయాయంటే బాంబేకు చెందిన సినీ నటి కాదంబరిని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారి ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా చేపడతాం. నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండ ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత మాదే, అలాగే పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. జలశయాలన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఇదే భవిష్యత్తు మార్పుకు శుభసూచకమన్నారు. ఒకప్పుడు విద్యుత్ ఎక్కడో ఉత్పత్తి జరిగేది, కాని నేడు మీ స్కూల్ లోనే, మీ ఇంట్లోనే, మీ పొలంలోనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి చేసుకోవచ్చు. మా తరంలో స్కూల్ కైనా ఎక్కడికైనా నడిచివెళ్లేవాళ్లం, మీ తరం అదృష్టవంతులు ఎక్కడికి కావాలన్న ఎలక్ట్రిక్ సైకిల్ అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్ లో మరిన్ని మార్పులు వస్తాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటి ద్వారా పొల్యూషన్ లేని గ్రీన్ కరెంట్ ను ఉత్పత్తి చేస్తాం. దీంతో మీకు ఉపాధి, ఉద్యోగ కల్పన జరుగుతుంది. తద్వార రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఖనిజ సంపదను ఎవ్వరిని దోచుకోనివ్వం, ఇసుకను ఫ్రీ గా ఇస్తాం. జీవవైవిధ్యంకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేశమంటే అడవులు, జంతువులు, పక్షులు, జల వనరులు అన్ని కలిస్తేనే సమతుల్యత ఉంటుంది. గాలి లేకపోతే మానవ మనుగడే లేదు. చెట్లు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు. ఈ రెండూ కాపాడుకోకపోతే మనం మనుషులమే కాదు. మన భవిష్యత్ కోసం పర్యావరణ సమతుల్యత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

జీవవైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు. 13 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, 3 నేషనల్ పార్క్ లు, 2 జూలాజికల్ పార్క్ లు, ఒక టైగర్ పార్క్, ఎలిఫెంట్ శాంచ్యురీ ఇవన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్యలో 5300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టైగర్ శాంక్చుయరీ వస్తుంది. అడవులను ఎవ్వరైనా విధ్వంసం చేస్తే వదిలిపెట్టం, ఇకపై మీ ఆటలు సాగవని ఎర్రచందనం స్మగ్లర్ లకు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే డ్రోన్ పర్యవేక్షణ తో వారి ఆగడాలను అరికడతామన్నారు. అడవికి హానితలపెట్టాలని ఎవ్వరైనా అడుగుపెడితే అదే వారికి చివరి రోజు అని హెచ్చరించారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు కావాలంటే మొక్కలు పెంచాలి. ప్రకృతి ప్రజల ఆస్తి దానికి అందరం కాపాడుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 32 కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలను సిద్ధం చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 నగర వనాలను పెంచుతాం. 2047 కి ఏపీ నెంబర్ వన్ స్టేట్ గా ఉండాలి. చిన్నారులు మీ భవిష్యత్ ఉజ్వల భవిష్యత్ గా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సాధారణ కుటుంబాలకు చెందిన చిన్నారులు సైతం పెద్ద స్థాయిలో ఉండాలంటే సంకల్పం కావాలి, సంకల్పం చేసుకోండి మీరు అనుకున్న లక్ష్యం కోసం పాటుపడండి. మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం. పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం. పెట్టుబడులు తెస్తాం. యువతకు భరోసా ఇస్తాం. సంపద కొందరి వద్దే ఉండటం కాదు పేదరికం లేని సమాజం తీసుకురావడానికి కృషి చేస్తాం. ఇలా చేయాలంటే నాలేడ్జి ప్రాముఖ్యతను గుర్తించి నాలేడ్జి ఎకానమితో అధ్బుతాలు సృష్టించవచ్చు. మా ఆలోచన హరితాంధ్రప్రదేశ్.. మా ఆశయం స్వర్ణాంధ్రప్రదేశ్..చిన్నారులందరూ మొక్కలు నాటుతామని, వాటిని సంరక్షిస్తామని సంకల్పం చేసుకోవాలని కోరారు. చిన్నారులు మీరు నాటిన మొక్కకు మీ అమ్మగారి పేరు పెట్టండి, కన్నతల్లి మనకు జన్మనిచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోడానికి ఒక మొక్క నాటుతాం అని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గత పాలకులు పట్టాదారు పుస్తకాలపై తన ఫోటో వేసుకున్నాడు. ఇప్పుడు అలా ఉండదు. రాష్ట్ర భవిష్యత్తు మీ యువత చేతుల్లో ఉంది. మీకు సహకారం అందించే బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని ప్రసంగం ముగించారు.. కార్యక్రమం చివరల్లో వ్యాఖ్యాత ఏకె.సుజాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కృష్ణార్జునతో పోల్చడంతో సరదాగా నవ్వుకున్నారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది..

ఉప ముఖ్యమంత్రి , పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామాత్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దానిని పరిరక్షించే బాధ్యత కూడా దక్కటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకు ముందు నేను స్వంతంగా మొక్కలు నాటే వాడిని, మరి కొంత మందిని మోటివేట్ చేసేవాడిని, ఇప్పుడు ప్రభుత్వపరంగా కోటి మొక్కలు నాటడానికి బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం. వరుణదేవుడు కూడా వర్షం కురిపించి తన శుభాశీస్సులు అందించడం హర్షనీయం. ప్రతిజ్ఞ చేయడం తేలిక, కాని పాటించడం కొంచెం కష్టం, అలాగే చెట్లను కూల్చివేయడం తేలిక కాని చెట్లను పెంచడం, కాపాడటం చాలా కష్టం. మూడుకాళ్ల ముదుసలి అనే చిన్ననాటి పాఠం గుర్తుకువస్తున్నది. ఈనాడు మనం నాటే ప్రతి చెట్టూ మన భావితరాల భవిష్యత్ కోసం నాటుతున్నాం. వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు. మన రాష్ట్రంలో వనాలు, అడవుల విస్తీర్ణం 29 శాతం ఉన్నాయి. వాటిని 50 శాతంకు పెంచాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆశయం. అందులో భాగంగానే వన మహోత్సవంలో భాగంగా కోటి మొక్కలు నాటాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నాము. జూన్, జూలైతో మొదలై నవంబర్ లో వచ్చే కార్తీక వన సమారాధన వరకు మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించుకోవడం కూడా మన బాధ్యత.మొక్కలు నాటడం ఒక్కరితో కాదు ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవ్వాలి. దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు, ప్రభుత్వ కార్యలయాలు, ప్రైవేటు కార్యాలయాలు ఎక్కడైనా పచ్చదనం పెరగాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భగభగలాడే ఎండ వచ్చినప్పుడే నీడ తాలుకూ విలువ తెలుస్తుంది. చెట్లు నాటడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టివేశారు. కోనసీమలో కొబ్బరిచెట్టును పెద్దకొడుకుగా భావిస్తారు. అరణ్య సూక్తం చదివినప్పుడే ఒక చెట్టు పది మంది సంతానంతో సమానమన్నది స్పష్టమవుతుంది. తక్కువ విస్తీర్ణంలో కూడా పచ్చదనం పెంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి. మియావకి అనే జపనీస్ ప్రతిపాధించిన మియావకి ఫారెస్ట్ మెథడ్ ను పాటిస్తే చాలా త్వరగా అడవులు పెరుగుతాయి. అటవీ శాఖ ద్వారా ఆ వివరాలను అందరికి అందేలా చూస్తాం. తక్కువ విస్తీర్ణంలోనే 3 నుంచి 5 సంవత్సరాల తక్కువ కాలంలోనే అడవిని సృష్టించవచ్చు అన్నారు.

కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మనం ఒక విత్తనం నాటినప్పుడు విత్తనం భూమిలో ఉంటుంది. డార్క్ నెస్ లో ఉంటుంది. అన్నింటిని చీల్చుకుని బయటకు వస్తుంది. ఇది మన జీవితానికి ఒక పోలిక. చెట్టు సూర్యుడి వైపు ఎదుగుతుంది. అంటే ప్రగతి వైపు కాతి వైపు వెళుతుంది. ఆటుపోట్లను తట్టుకుని నిదానం వెళుతుంది. జీవితం కూడా అలాంటిదే..చెట్ల వేర్లు భాగా విస్తరిస్తాయి. కనపడవు కాని చెట్టును బలంగా నిలబెడుతుంది. అలాగే మన వెనకుండే వారిని ఎప్పుడూ మరవద్దన్నారు.

కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఏసురత్నం, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ అనంతరాము, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ,ఇతర ఉన్నతాధికారులు, శాఖాధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *