-ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి
-మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు,రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలి. వర్షాలకు ఉధృతంగా ప్రవహించే వాగుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. పలు చోట్ల విష జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలి. గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు వేగవంతం చేయాలి. ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలి. అలాగే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో చెరువులు నిండుతాయి. అలాంటి చోట్ల నీటిపారుదల శాఖ అధికారులు చెరువులను నిత్యం పర్యవేక్షించాలి. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి. అలాగే పెన్షన్ పంపిణీ సమయంలో ఎటువంటి ప్రమాదాలకు గురవకుండా రెవెన్యూ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలకు శెలవు ప్రకటించాలి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లినవారు జాగ్రత్తగా తీరం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.