-మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం పై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తుచేయాలని అధికారులకు సీఎం సూచించారు. రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పకపాటించాలని సిఎం కోరారు.