గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని 62వ డివిజన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తుది దశకు వచ్చాయని, గత 24 గంటల్లోనే షుమారు 150 ట్రక్ ల వ్యర్ధాలను ప్రజారోగ్య కార్మికులు తొలగించారని విజయవాడ 62వ డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం డివిజన్ లోని అంతర్గత వీధుల్లో వరద అనంతరం పేరుకున్న వ్యర్ధాల తొలగింపును పర్యవేక్షణ చేస్తూ, ఆయా ప్రాంతాల్లో బాదితులకు దాతలు అందించిన దుప్పట్లను కమిషనర్ అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ 62వ డివిజన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తుది దశకు వచ్చాయని, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో లోతట్టు ప్రాంతాల్లో నీటిని బెయిల్ అవుట్ చేయడం, వరద అనంతరం బురద తొలగింపు, డ్రైన్లపై ఆక్రమణల తొలగింపు చేపట్టామన్నారు. గత 24 గంటల్లోనే డివిజన్ పరిధిలో అంతర్గత వీధుల్లోని షుమారు 150 ట్రక్ ల వ్యర్ధాలను తొలగించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన డ్రైన్లలో వ్యర్ధాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రతి వీధిలో బ్లీచింగ్ చల్లించడం, కాల్వల్లో దోమలు పెరగకుండా యాంటీ లార్వా స్ప్రే చేయించామని తెలిపారు. అతి త్వరలో డివిజన్ ని వరద ప్రభావం నుండి పునరుద్దరణ చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
అనంతరం గుంటూరు మిద్దెతోట గ్రూప్ అడ్మిన్ చెలికాని సీతారామయ్య ఆధ్వర్యంలో సభ్యులు లఘువరపు సత్యనారాయణ, పులి ఆంజనేయులు, ధనుంజయ్ లు వరద బాధితులకు అందించిన 275 దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. వరద ప్రభావంతో సర్వసం కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.
Tags guntur
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …