-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు ఆరు వస్తువులతో కూడిన కిట్లను అందజేసిన నిగమ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత కొనియాడారు. నగరంలోని భవానీ ఘాట్ స్వాతి సెంటర్ లో వరద బాధితులకు మంత్రి కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు పది రోజుల పాటు రేయింబవళ్ళు కష్టపడి విజయవాడ వరద బాధితులను ఆదుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో పలు స్వచ్చంధ సంస్థలు కూడా వరద బాధితులకు అండగా నిలిచారన్నారు. అనంతపురానికి చెందిన నిగమ ఫౌండేషన్ రూ.650 విలువ కలిగిన కిట్లను 1200 కుటుంబాలకు అందజేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఒక్కో కిట్ లో స్టీల్ ప్లేట్, బౌల్, దుప్పటి, టవల్..ఇలా ఆరు రకాల వస్తువులను ఉన్నాయన్నారు. రూ.5 లక్షల విలువైన కిట్లను వరద బాధితులకు అందజేసిన నిగమ ఫౌండేషన్ నిర్వహాకుడు సమీర్ కుమార్ ను మంత్రి సవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.