మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) తరలింపుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో జిల్లా పంచాయతీ అధికారిణి జె అరుణ, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజుతో సమావేశమై ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) తరలింపుపై చర్చించారు. స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలు, పట్టణాలలోని గృహాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ షాపులు, ఎలక్ట్రికల్ వస్తువుల అమ్మకపు షాపుల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాలని ఇటీవల మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఇతర అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాల వివరాలపై కలెక్టర్ అధికారులను ఆరా తీశారు.
జిల్లాలో మొత్తం 497 గ్రామపంచాయతీలతో పాటు పట్టణ స్థానిక సంస్థలు మచిలీపట్నం, పెడన, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప మున్సిపాలిటీల నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరిస్తూ ఉన్నామని, ఇప్పటివరకు దాదాపు 1.5 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించినట్లు జిల్లా పంచాయతీ అధికాణి కలెక్టర్కు వివరించారు. సేకరించిన మొత్తాన్ని మండలంలోని పోతేపల్లి వద్ద నిల్వ చేయాలని, అక్కడనుంచి రీసైక్లింగ్ కోసం సంబంధిత పరిశ్రమకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఇకనుండి నిరంతరంగా ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించేందుకు వీలుగా మేజర్ పంచాయితీల్లో కియోస్క్ లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.