వర్షాకాలం తురువాత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కార్యాచరణ

-అబ్కారీ, గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
-అక్టోబరు 15 నుండి 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో వినియోగంలోకి 108 రీచ్ లు
-అతి త్వరలో రాష్ట్ర పర్యావరణ మదింపు కమిటీ నియామయం
-త్వరితగతిన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలం తర్వాత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, అబ్కారీ, గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇసుక లభ్యతను పెంచడానికి 2024 అక్టోబరు ఒకటిన జారీ చేసిన జి.ఓ. 59 ప్రకారం పట్టా భూముల నుండి ఇసుక తవ్వకాలకు కూడా అనుమతి ఉందన్నారు. 2024 అక్టోబర్ 15నుండి స్టాక్‌యార్డులు, డి-సిల్టేషన్ పాయింట్లు, రీచ్‌ల ద్వారా ఇసుక డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 108 రీచ్‌లు మాన్యువల్ పద్ధతులను ఉపయోగించి పనిచేయించటం వల్ల, అక్టోబర్ 15 నుండి అన్ని జిల్లాలలో సరఫరా గణనీయంగా పెరుగుతుందన్నారు. ఫిబ్రవరి 2023లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక రీచ్‌లకు సంబంధించి పర్యావరణ అనుమతులను రద్దు చేసి, సెమీ మెకనైజ్డ్ మైనింగ్ కోసం పబ్లిక్ హియరింగ్‌లను తప్పనిసరి చేసిందన్నారు. 2024 జూన్ కి ముందు ఇవి ఎలాంటి విచారణకు నోచుకోలేదని, ఫలితంగా ఎటువంటి పురోగతి లేకుండా పోయిందన్నారు. ఈ రీచ్‌లను వినియోగంలోకి తీసుకువచ్చేలా కార్యాచరణ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించగా, 2024 జూన్ తరువాత 18 పబ్లిక్ హియరింగ్‌లను పూర్తి అయ్యాయని, మరో 32 పురోగతిలో ఉన్నాయని మీనా వివరించారు. రాష్ట్ర పర్యావరణ మదింపు కమిటీ నిర్మాణాన్ని పూర్తి చేసి, మరియు అదనపు రీచ్‌లను అమలులోకి తీసుకురావటానికి పర్యావరణ శాఖతో కలిసి పని చేయనున్నామన్నారు.

వర్షాకాలంలో ఇసుక తవ్వకాలపై పరిమితి:
వర్షాకాలంలో ఇసుక మైనింగ్ కార్యకలాపాల పరిమితి కారణంగా, జూలై నుండి ఇసుక సరఫరాకు ఇప్పటికే ఉన్న నిల్వలు మాత్రమే ఆధారం అయ్యాయని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. వర్షాకాలం ముగిసే వరకు నదీగర్భాల్లో రీచ్‌లు పనిచేయకపోవడం వల్ల స్టాక్‌యార్డుల సంఖ్య జూలైలో 86 నుండి 14కి తగ్గినా, 58 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 20 డి-సిల్టేషన్ పాయింట్‌లు అవసరమైన అనుమతులు మంజూరు చేయటంతో ఆగస్టు 15 నుండి జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అవి పని చేస్తున్నాయని మీనా పేర్కొన్నారు.

ఇసుక కోసం ఆన్‌లైన్ పోర్టల్
2024 సెప్టెంబర్ 19న ముఖ్యమంత్రి “AP సాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్”ని ప్రారంభించగా, ఇది ఇసుక బుకింగ్, డెలివరీ కోసం డిజిటల్ పరిష్కారాన్ని అందించే మొట్టమొదటి పోర్టల్ గా ఉందని మీనా తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్‌ను సులభతరం చేస్తూ, డెలివరీ స్లాట్‌లను నిర్దేశిస్తూ, ఇ-పర్మిట్‌లను జారీ చేస్తుందన్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ స్లాట్‌లుగా విభజించబడిన సరఫరా సామర్థ్యం మేరకు బుకింగ్‌లు వారానికోసారి విడుదల చేస్తున్నామన్నారు. ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వారా ఇసుక బుకింగ్‌లను ప్రారంభించే నిర్దిష్ట సమయాన్ని ప్రకటిస్తుందని, ఇది వినియోగదారులందరికీ మంచి సమాచారం అందిస్తుందని, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవడానికి సమాన అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.

రవాణా సౌకర్యం
ఉచిత ఇసుక విధానంలో వినియోగదారుల నుంచి రవాణా దారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం గమనించిన నేపధ్యంలో దీనిని పరిష్కరించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత రవాణా ధరలను తెలియజేస్తూ ప్రభుత్వం 14 సెప్టెంబర్ 2024న జిఓ 52ని జారీ చేసిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రభుత్వం సులభతరమైన రవాణాతో పాటు సొంత రవాణాకు సైతం అవకాశం కల్పించామని, రవాణాదారుల కోసం రిజిస్ట్రేషన్, ఆర్డర్ కేటాయింపు ప్రక్రియను కూడా ప్రభుత్వం సులభతరం చేసిందన్నారు. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు రేట్లు మరింత సహేతుకంగా ఉండేలా సమీక్షించబడ్డాయన్నారు. వినియోగదారులకు సహాయం చేస్తూ, సాఫీగా కార్యకలాపాల కోసం రవాణాదారులతో సమన్వయం చేయడానికి జిల్లా స్థాయి కేంద్రాలు స్థాపించబడ్డాయన్నారు.

అక్రమ మైనింగ్, రవాణా నియంత్రణ:
ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను నిరోధించటానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ లను బలోపేతం చేశామని, ప్రజలకు తక్కువ ధరలతో ఇసుకను అందుబాటు ధరలకు పొందేలా అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని మీనా స్పష్టం చేసారు. ఇసుక రవాణా చేసే అన్ని వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయగా, కేటాయించిన మార్గం నుండి వైదొలగిన వాహనంను బ్లాక్ లిస్ట్ చేసేలా ఏర్పాట్లు చేసామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అన్ని ఆర్డర్‌లు ధృవీకరించబడుతున్నాయని, ఇసుకను నిల్వ ఉంచడం లేదా తిరిగి విక్రయించడం వంటి వాటికి పాల్పడిన రవాణాదారులు జరిమానాలను ఎదుర్కొంటారన్నారు.

ఫీడ్‌బ్యాక్ మెకానిజం:
వినియోగదారుల సంతృప్తిని నమోదు చేయడానికి, స్వీకరించిన అభిప్రాయాన్ని మరింత మెరుగుపరచడానికి, వినియోగదారులకు ప్రతిరోజూ ఐవిఆర్ఎస్ కాల్స్ చేయబడుతున్నాయని మీనా పేర్కొన్నారు. ఐవిఆర్ఎస్ కాల్స్ అధారంగా సంతృప్తి చెందని వినియోగదారుల నుండి వివరణాత్మక అభిప్రాయం కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సంప్రదిస్తున్నామన్నారు. వినియోగదారుల సంతృప్తిని మెరుగుపరిచేలా, అవసరమైన చర్యలను తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. వినియోగదారుల ఇసుక బుకింగ్ , డెలివరీ అనుభవం గురించి వారి నుండి అభిప్రాయాన్ని పొందడానికి 3వ పార్టీ ఏజెన్సీల ద్వారా రోజువారీ ఆర్డర్‌లలో మరో ఐదు శాతానికి తగ్గకుండా ఆడిట్ చేస్తున్నామని గనులు, భూగర్భ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

ఉచిత ఇసుక సరఫరా
గత ప్రభుత్వ హయాంలో ఇసుక కార్యకలాపాలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించగా, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యకలాపాలు జరిగాయి. సుప్రీం కోర్ట్ , నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిని తీవ్రంగా పరిగణించి, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, ప్రతినెలా తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 2024లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జూలై 8న ఉచిత ఇసుక సరఫరా విధానాన్ని ప్రవేశపెట్టారు. పర్యావరణ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఇసుక సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూడటం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇసుక కార్యకలాపాలను ప్రైవేట్ ఏజెన్సీల నుంచి స్వాధీనం చేసుకుని జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అప్పగించారు. వినియోగదారులు కేవలం కార్యాచరణ ఖర్చులు, చట్టబద్ధమైన రుసుములకు మాత్రమే చెల్లిస్తారు. దీనికి విరుద్ధంగా, మునుపటి పాలన ప్రభుత్వం వాటాగా టన్నుకు రూ. 275 వసూలు చేసింది. ఉచిత ఇసుక పాలసీ కింద 86 సరఫరా కేంద్రాల్లో జూలై 8 నుంచి ఇసుక సరఫరా ప్రారంభమైంది. ఇప్పటి వరకు 28.07 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశారు. ప్రస్తుతం వివిధ స్టాక్‌యార్డుల వద్ద 4.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక సరఫరాకు అందుబాటులో ఉంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *