విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అంతా మిషన్ మోడ్‌తో పనిచేసి బుధవారంనాటి ప్రధాని పర్యటనా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖపట్నం కేంద్రంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో కూటమి నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన విజయవంతానికి ప్రతి ఒక్కరూ సింగిల్ అజెండాతో పని చేయాలని, గతంలో మోదీ పర్యటనలకు మించి విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి కీలకమని అంటూనే.. ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ప్రధానిగా మోదీ పూర్తి మద్దతిస్తున్నారని పల్లా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని, ఈ సమయంలో కేంద్ర సహకారంతో రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి సాధించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
రోడ్ షోకు భారీ ఏర్పాట్లు
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున నిర్వహిస్తోన్న రోడ్ షో విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే ప్రత్యేక బారకేడ్ల ఏర్పాట్లు జరిగాయన్నారు. రోడ్ షో కోసం విభాగాలవారీ బాధ్యతలు స్వీకరించిన ప్రజాప్రతినిధులు, అధికార్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పల్లా సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో, బహిరంగ సభలకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలను మూడు పార్టీలనుంచి ఒక్కొక్క ప్రజాప్రతినిధి చొప్పన సమన్వయ బాధ్యతలు అప్పగించారు. వీరితో సమావేశమైన పల్లా.. చివరి క్షణాల్లో వాస్తవ పరిస్థితిని సమీక్షించారు. సభకు హాజరైన ప్రజలు సురక్షితంగా ఇళ్లకు చేరేలా చేసిన పటిష్ట ఏర్పాట్లనూ సమన్వయ ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. బహిరంగ సభలో నియోజకవర్గాల వారీగా బ్లాక్‌లు ఏర్పాటు అంశంపైనా చర్చించారు.
బహిరంగ సభకు 3 లక్షలమంది హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ప్రజలను బహిరంగ సభకు తరలించే అంశంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానమంత్రి బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి, పొరుగు జిల్లాలనుంచి సుమారు 3 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం లేకపోలేదు. ఇందుకు తగ్గట్లుగా వసతులు, భోజన సదుపాయం తదితర అంశాలపై పల్లా సహా మంత్రుల బృందం చర్చించింది. జనసమీకరణ, పార్కింగ్, పాస్‌ల పంపిణీపైనా సమావేశంలో చర్చించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారికీ పార్కింగ్ ఏర్పాట్లు చేసే అంశాన్ని పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోదీ చారిత్రక సభకు సర్వసన్నద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.