Breaking News

స్వర్ణాంధ్ర భవిష్యత్‌ ప్రణాళిక-2047 పై చర్చ జరగాలి

-అవినీతికి పాల్పడిన అదానీని అరెస్టు చేయాలి
-అదానీ కుంభకోణంపై సీపీఐ జాతీయ సమావేశాల్లో చర్చిస్తాం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్వర్ణాంధ్ర భవిష్యత్‌ ప్రణాళిక-2047 పై మేథావులు, ఆర్థిక వేత్తలు, ప్రొఫెసర్ల వంటి వర్గాలతో చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఊహాలోకంలో తేలియాడే విధంగా ప్రణాళిక ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం ప్రస్తుతం 3200 డాలర్లు ఉండగా, 2047 నాటికి అంటే 23 ఏళ్ల తరువాత 42 వేల డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నారని ఇది ఎలా సాధ్యం అని సందేహం వ్యక్తం చేశారు. మన రూపాయి విలువ తగ్గుతుందని, డాలరు విలువ పెరుగుతుందన్నారు. ఇప్పుడున్న ఒక డాలరు విలువ 82 రూపాయలుగా ఉందని, ఈ విధంగా కొనసాగితే 2047 నాటికి ఒక డాలరుకి 200 రూపాయలు ఉంటుందన్నారు. అలాగే ఎగుమతులు విషయంలో ప్రస్తుతం 19.3 బిలియన్‌ డాలర్లుగా ఉందని, అది 450 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పడం సాధ్యం అయ్యేది కాదని, ప్రక్క రాష్ట్రాల నుంచి కొని ఇక్కడ నుంచి ఎగుమతులు చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు సాధ్యంకాని వాటి గురించి చెప్పటం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో, దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని చెప్పారు. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచిపెడుతూ మరోవైపు పేద, ధనికవర్గాల మధ్య తారతమ్యాలను తగ్గిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే స్వర్ణాంధ్ర భవిష్యత్‌ ప్రణాళికపై చర్చలు జరపాలని, కనీసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అయినా ఈ చర్చలు నిర్వహించాలని కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అదాని అవినీతి వ్యవహారాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం మంచిది కాదన్నారు. అదానీ కంపెనీ రూ.2,100 కోట్ల రూపాయలను నాలుగు రాష్ట్రాలకు ముడుపులుగా ఇచ్చినట్లు అమెరికా సంస్థ తెలిపిందన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్‌కి రూ.1,750 ముట్టజెప్పినట్లు స్పష్టం చేసిందని వాటిని ఏదో పెద్దతల తప్ప ఇంత మొత్తాన్ని తీసుకోలేరని మాజీ సీఎం జగన్‌ను ఉద్ధేశించి అన్నారు. గుజరాత్‌లో ఎన్‌టీపీసీ నుంచి యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.99 పైసలకు కొంటే, అదే విద్యుత్‌ను మన రాష్ట్ర ప్రభుత్వం సెకీ నుండి రూ.2.49 పైసలకు కొనుగోలు చేస్తున్నదన్నారు. ఈ విధంగా లక్ష కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ నాయకులు ఈ దోపిడీలో పాలుపంచుకున్నారని విమర్శించారు. ఇంత పెద్ద అవినీతి జరిగినా సీఎం చంద్రబాబు పరిశీలిస్తాం అంటున్నారని, అసెంబ్లీలో కనీసం అదాని పేరు కూడా ప్రస్తావించలేక పోయారని ధ్వజమెత్తారు. సాంకేతిక పరిజ్ఞానం బాగా వినియోగించుకునే చంద్రబాబు ఇంకా పరిశీలిస్తామనటం సరికాదన్నారు. గతంలో ఇదే అభియోగాలపై టిడిపి తరఫున పయ్యావుల కేశవ్‌, సీపీఐ తరుపున తాను హైకోర్టులో పిటీషన్‌ వేసినట్లు గుర్తు చేశారు.
కెన్యా దేశ అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసినట్లు ప్రకటిస్తే విశేష స్పందన వచ్చిందని ఆ వీడియోని మీడియాకు చూపించారు. అదే పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ అంశాన్ని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో సిపిఐ లేవనెత్తుతుందని, దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *