-రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకోవచ్చు..
-దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దని రైతులకు మంత్రి సూచన
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను కోరారు. గురువారం మంత్రి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజాతో కలసి కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ధాన్యం రాశులను పరిశీలించి రైతుల ఇబ్బందులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఎంటియు 1262 వరి రకం పంటను మిల్లర్లు తీసుకోవడం లేదని కొంతమంది రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ప్రభుత్వం తప్పనిసరిగా అలాంటి రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా తనను ఫోన్లో నేరుగా సంప్రదించవచ్చని, తలెత్తిన సమస్యను అధికార యంత్రాంగంతో వెంటనే పరిష్కరింప చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని,. రైతు నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసి కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.
ధాన్యం కొనుగోలు అంశంలో రైతులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలను తీసుకొచ్చిందని తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా రైతుకు నచ్చిన మిల్లుకు తమ ధాన్యం అమ్ముకోవచ్చన్నారు. అదేవిధంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గతంలో ఉన్న 17 తేమ శాతం నిబంధనను కొంతమేర సడలించామని, కేవలం ఐదు కేజీల తరుగుతో 24 శాతం వరకు తేమశాతం వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. వాహనాలకు జిపిఎస్ వ్యవస్థ లేకపోయినా లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణాకు అవకాశం కల్పించామని, దీని ద్వారా అవసరం మేరకు జిల్లా పరిధి దాటి కూడా వాహనాలను ఉపయోగించుకోవచ్చన్నారు. మిల్లర్లు సైతం చాలా మంది గతంలో బ్యాంకు గ్యారంటీ చెల్లించలేదని, వారికి 1:2 నిష్పత్తి పద్ధతిలో విసులుబాటు కల్పించామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకువెళుతున్నామని, 24 గంటల లోపే రైతులకు ధాన్యం నగదు వారి ఖాతాలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఇవ్వకపోతే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అట్టి మిల్లులను మూసివేస్తామని మంత్రి హెచ్చరించారు. దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని విక్రయించుకుని మద్దతు ధర పొందాలని మంత్రి సూచించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి వి పార్వతి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ సృజన, స్థానిక నాయకులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News