-రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులను కలిశాం…
-కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి,ధైర్యం చెప్పిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ ,జిల్లా కలెక్టర్, ఎస్పీ
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులను కలిశామని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ సి.హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతికి చెందిన ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ సి.హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఈ సంఘటన గురించి తెలుసుకుని మీ దగ్గరకు వెళ్లి వివరాలు కనుక్కోవాలని నన్ను పంపారని దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా కుటుంబ సభ్యులకు వివరించారు. తన ఫోన్ నంబర్ ఇచ్చి, ఏ సమయంలో అయినా తనతో ఫోన్ లో మాట్లాడవచ్చని, కేసుకు సంబంధించి వివరాలు తెలుపవచ్చన్నారు. యువతి మృతి సంఘటన గురించి స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్, ఎస్పీ ఆరా తీశారు. వారి కుటుంబ పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియా తో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా మాట్లాడుతూ స్వయంగా తనను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంపించారన్నారు .ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దిశ స్పెషల్ ఆఫీసర్ గా రావడం జరిగిందన్నారు. పాతబాడు గ్రామంలో ముస్లిం యువతి అనుమానాస్పద మృతి ఘటన పై సీఎం గారు చాలా బాధపడ్డారనీ, వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తనను కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం, ఎర్రబాడు గ్రామానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకొని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూడాలని పంపించారన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్ని బాధిత కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకున్నామన్నారు. కుటుంబ సభ్యుల అనుమానాలు ఏంటి, అభిప్రాయాలు ఏంటి అనే విషయాల పై వివరాలు తెలుసుకున్నామన్నారు. తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేయడానికి కేసును దిశ డి.ఎస్.పి పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఆదుకోవడానికి కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసి, మృతి చెందిన కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తూ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అలాగే బాధిత కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తున్నారని, వెంటనే ఇళ్ళు మంజూరుతో పాటు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఆర్ డి ఓ కు ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఎస్పీ సి.హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నామన్నారు. కేసు పురోగతి లో ఉందని, కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి, గ్రామంలో ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియచేయాలని ఎస్పీ కోరారు.
పర్యటనలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.