గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం కమిషనర్ గారు లాంచెస్టర్ రోడ్, సాయికృష్ణ నగర్, ఆనందపేట, బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో దశల వారీగా క్వాలిటి కంట్రోల్ సిబ్బంది రికార్డ్ చేయాలన్నారు. ఎమినిటి కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పనులను ప్రతి రోజు పరిశీలించాలని, నాణ్యతలో లోపం గుర్తిస్తే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. ఇప్పటికే వార్డ్ సచివాలయాల వారీగా అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని, ప్రాధాన్యత క్రమంలో చేపడతామన్నారు. అలాగే నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు జరిగేందుకు డివిజన్ల పునర్విభజన చేశామని, పనులకు అవసరమైన వాహనాలు, పుష్ కాట్స్, బిన్లు అందించినందున, శానిటరీ ఇన్స్పెక్టర్లు క్రమ పద్దతిలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం, గ్యాంగ్ వర్క్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో శుభ్రం జరగాలన్నారు. పర్యటనలో ఏఈ రవి కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ అంగడి రాజేష్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News