-నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణల ఆవిష్కరణ సభలో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు IAS
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుస్తకాలు, కిటికీలు తెరిస్తే అవి జ్ఞాన ప్రపంచపు ద్వారాలు తెరుస్తాయని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు IAS అన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవం సందర్భంగా చెరుకూరి రామోజీరావు వేదికపై శుక్రవారం జరిగిన నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణల ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ‘పలహారాల చెట్టు’, ‘పుత్తడి బొమ్మతో స్నేహం’, ‘మాట్లాడే గడియారం’, ‘చిక్కుముడి’ అనే అనువాద బాల సాహిత్య రచనలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మున్సిపల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన నేను ఈ రోజు ఒక సివిల్ సర్వీసెస్ అధికారిగా మీ ముందు ఉన్నాను అంటే.. దానికి పుస్తకాలు, పబ్లిక్ లైబ్రరీలు కారణం అయ్యాయి’’అని పేర్కొన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ అమూల్యమైన ప్రచురణలు సమగ్ర శిక్ష ద్వారా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ఎంతో కష్టపడి విద్యావేత్తలు, నిపుణులు రూపొందించిన పుస్తకాలు పాఠకుడు, విద్యార్థి వరకు చేర్చడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారిందన్నారు.
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో పాఠశాల గ్రంథాలయాల్లో విద్యార్థులకు వసరమైన అన్ని పుస్తకాలూ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోందన్నారు. పుస్తకాల వినియోగం మీద ఉపాధ్యాయులకూ, విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ అవగాహన పెంచాల్సి ఉందన్నారు. వేదికపై బాలసాహిత్య పుస్తకాలను సమీక్షించిన విజయవాడ జీడీఈటీ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు జ్ఞానప్రసూన, పవన్ సాయిలను అభినందించారు. అనంతరం ఎస్పీడీ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఏర్పాటు చేసిన స్టాలును సందర్శించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ బుక్ ట్రస్టు కార్యవర్గ సభ్యులు జి. వల్లీశ్వర్, నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ ప్రాంత బాధ్యులు పత్తిపాక మోహన్, బాలసాహితీవేత్తలు ముంజులూరి కృష్ణకుమారి, అమరవాది నీరజ పుస్తకమహోత్సవ సంఘం అధ్యక్షులు కె. లక్ష్మయ్య పాల్గొన్నారు.