-నేషనల్ యూత్ డే ఫెస్టివల్లో ప్రధాని మోడీని కలిసిన ఎంపీ హరీష్ బాలయోగి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
-ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై ప్రధాని మోడీకి వినతి
-యూత్ హాస్టల్స్ ఏర్పాటు, ఏపీకి నిధులు కేటాయించాలని కోరిన ఎంపీ హరీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని యువతను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలవైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని అమలాపురం ఎంపీ, సెంట్రల్ స్పోర్ట్స్ పార్లమెంటరీ సభ్యులు జీఎమ్ హరీష్ బాలయోగి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ప్రధాని నరేంద్రమోడీకి విన్నవించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం జరిగిన నేషనల్ యూత్ డే ఫెస్టివల్లో ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ప్రధాని మోడీని కేంద్ర క్రీడాశాఖామంత్రి మన్షుక్ మాండవీయ, ఎంపీ హరీష్త్ కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండవీయ ఆహ్వానం మేరకు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2025 కార్యక్రమానికి ఏపీ నుంచి 68 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రి మాండవీయకు ఏపీలో క్రీడారంగం అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఎంపీ హరీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడులు వినతిపత్రం అందజేశారు. గతంలో ఏపీలోని క్రీడాకారులకు యూత్ హాస్టల్స్ ప్రయోజనకరంగా ఉండేవని, ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకోవడంతో మరుగునపడ్డాయని, క్రీడాకారులకు వసతి సదుపాయం లేక ఇబ్బందిపడుతున్నారని ప్రధాని మోడీకి వివరించారు. క్రీడాకారుల ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ యూత్ హాస్టళ్లను నిర్మించాలని ఎంపీ హరీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని యువతను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలవైపు ప్రోత్సహించేందుకు కేంద్రం సహకరించాలని, ఏపీలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలని వారు కోరారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన శాప్ ఛైర్మన్..
న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ డే ఫెస్టివల్లో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని అమలాపురం ఎంపీ, సెంట్రల్ స్పోర్ట్స్ పార్లమెంటరీ సభ్యులు జీఎమ్ హరీష్ బాలయోగితో కలిసి శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో విద్యాశాఖ మరియు క్రీడాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు శాప్ ఛైర్మన్ రవినాయుడు వివరించారు.