-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు ఉత్పాదకతను పెంచి వ్యాధులను నియంత్రించడానికి పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుసంవర్ధన సేవలను అందుబాటులో తీసుకువచ్చేందుకు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ అన్నారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి 31వ తేది వరకు జిల్లాలో నిర్వహించనున్న పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ కరపత్రాలను జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ నగరంలోని ఆయన విడిది కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశువుల పోషణకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు పశు ఉత్పత్తిని పెంచేందుకు వ్యాధులు నివారించడానికి పశుపోషణ ఖర్చు తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 9 ఏరియా పశు ఆసుపత్రులు, 43 డిస్పెన్సరీలు, 41 గ్రామీణ పశు వైద్య కేంద్రాలు, 127 ఆర్ఎస్ కెలు ద్వారా పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నారు. పశు పోషకులకు పశు వైద్యం చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ నెల 20 నుండి 31వ తేది వరకు ప్రత్యేక పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక పశు వైద్యులు, ఒక పారా పశు వైద్యులు, పశుసంవర్ధక సిబ్బందితో టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలానికి రెండు టీంల చొప్పున 36 టీంలు ప్రతి గ్రామంలోను వైద్య శిబిరాన్ని నిర్వహించి గొర్రెలు, మేకలు, లేగ దూడలకు నట్టల మందు ఉచితంగా అందిస్తారన్నారు. పశువుల గర్భకోశ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన శాస్త్ర చికిత్సలు చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. పశు పోషకులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు ఆర్ధిక సహాయాలు గురించి వివరించండం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం. హనుమంతరావు, సహాయ సంచాలకులు డా. ఎం. వెంకటేశ్వరావు, పశు వైద్యులు డా. బి. మనోజ్ లు పాల్గొన్నారు.