– క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిరంతర పటిష్ట పర్యవేక్షణతో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా చేపట్డం జరిగిందని జిల్లా కలెక్టర్ డి. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ అర్బన్ పరిధిలోని మధురానగర్, మధ్యకట్ట ప్రాంతంలో పర్యటించి ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ శనివారం ఉదయం ఏడు గంటలకు పంపిణీని ప్రారంభించి, 2,29,913 పెన్షన్లకు రూ. 98.20 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని.. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషిచేస్తున్నారన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు నిరంతరం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు ఇంటివద్దే పెన్షన్ మొత్తాన్ని అందించేలా చూస్తున్నట్లు తెలిపారు. మొదటిరోజు పూర్తిస్థాయిలో పంపిణీకి కృషిచేయడం జరుగుతోందని.. ఇంకా ఎవరైనా మిగిలియుంటే మూడో తేదీలోగా పూర్తిచేయనున్నట్లు వివరించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ చేయాల్సి వస్తే అందుకు తగిన కారణాన్ని ఎన్‌టీఆర్ భరోసా మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News