– లక్ష్యం మంచిదైతే విజయం సిద్ధార్ధ సంస్థల్లా ఉంటుంది
– చిన్న కాలేజీతో మొదలై నేడు విద్యా కేంద్రంగా మారింది
– అంబేద్కర్, అబ్దుల్ కలాం స్పూర్తితో యువత ముందుకు వెళ్లాలి
– ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మనదే
– నాడు ఏపీని ఐటీ కేపిటల్ చేశారు.. మనం ఏఐ కేంద్రంగా మారుద్దాం
– సిద్ధార్ధ ఫౌండేషన్ ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్ధులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సిద్ధార్థ సంస్థల పాత్ర అభినందనీయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని సిద్ధార్ధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 26వ వార్షిక ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దాదాపు 26 సంవత్సరాలుగా సిద్ధార్థ ఫౌండేషన్ ద్వారా విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ అందించి ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. 1975లో చిన్న విద్య సంస్థగా ఏర్పాటై.. ఇప్పుడు ఏకంగా 18 విద్యాలయాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలి ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ, ఫార్మా లాంటి కాలేజీలుసిద్ధార్థ విద్య సంస్థలకే సాధ్యమైంది. లాభాపేక్ష లేనందువల్లనే ఇంత పెద్ద సామ్రాజ్యం సాకారమైంది. సిద్ధార్ధ కాలేజీలను చూస్తుంటే ఒక వైపు సంతోషం, మరోవైపు ఈర్శ్యగా ఉంది. గతంలో మచిలీపట్నంలోనే విద్య కేంద్రంగా ఉండేదని, సిద్ధార్ధ సంస్థల కారణంగా.. విజయవాడ ఆ పేరును దక్కించుకుందని చమత్కరించారు.మెరుగైన చదువుతో మాత్రమే మెరుగైన జీవితం సాధ్యమవుతుందని యువత గుర్తుంచుకోవాలి. అంబేద్కర్, అబ్దుల్ కలాం స్పూర్తితో విద్యార్ధులంతా ముందుకు వెళ్లాలి. గతంలో ఉన్నత విద్య అంటే ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. కానీ నేడు విద్య వ్యవస్థ మొత్తం మన ముంగిట్లోనే ఉంది. మనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ లక్ష్యాల సాధనకు ప్రయత్నించాలి.
రాష్ట్రానికి దశ దిశ మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైందన్నారు. రెసిడెన్షియల్ విద్యకు అన్న ఎన్టీఆర్ శ్రీకారం చుడితే.. ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుతో విద్య వ్యవస్థను మరో మెట్టు ఎక్కించిన ఘనత చంద్రబాబుకే సాధ్యం. ఆయన వలనే ధనవంతులకు మాత్రమే అనుకునే ఇంజనీరింగ్, మెడికల్ చదువులు పేదలకు కూడా దరి చేరాయి. కాలేజీలు ఏర్పాటు చేయడంతోనే కాకుండా.. చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం తీసుకొచ్చి లక్షలాది మందికి అవకాశాలు కల్పించారు. ఐటీని ప్రోత్సహించి, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు ఉండేలా చేశారు. మన రాష్ట్రంలోని మానవ వనరుల్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే తపనతో పని చేస్తున్నాం. గతంలో ఐటీని అందిపుచ్చుకున్నాం.. ఇప్పుడు ఏఏఐని అందిపుచ్చుకోవాలి. పేదలు కూడా విదేశాల్లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో విదేశీ విద్య పథకాన్ని తీసుకొచ్చాం. వేలాది మందిని విదేశాల్లో చదివించాం. సిద్ధార్ధ విద్య సంస్థల ఆధ్వర్యంలో దాదాపు 700 మంది విద్యార్ధులకు రూ.65 లక్షలు స్కాలర్ షిప్స్ అందించం అభినందనీయం. ఇప్పటి వరకు 19 వేల మందికి స్కాలర్ షిప్స్ అందించాలంటే ఎంతో గొప్ప మనసు ఉంటేనే సాకారమవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ప్రజలపై ప్రేమ, సమాజంపై బాధ్యత ఉన్నపుడే సాధ్యమవుతాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
Prajavartha Online Telugu News