అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి నేతృత్వంలోని గ్రానైట్ వ్యాపారుల బృందం నేడు సచివాలయంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో కలిసి గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై విన్నవించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రాయల్టీ ఫీజు, సహా వివిధ రకాల పన్నులను తగ్గించాలని లేదంటే రాష్ట్రంలో ఈ రంగం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను యం యస్ యం ఈ మంత్రి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేబినెట్ సహచరుల దృష్టికి తీసుకువెళ్ళి తమను ఆదుకోవాలని వారు కోరారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రానైట్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ విషయాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి గ్రానైట్ వ్యాపారుల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
